కాశ్మీర్ అల్లర్లకు పాక్ కారణం

కలహాలతో కాలిపొతున్న కాశ్మీర్ పై రాజ్యసభలో రగడ మొదలైంది. బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తర్వాత అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి. ఆగకుండా గత పది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ప్రభుత్వంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. దేశ సమగ్రత విషయంలో కేంద్రానికి సహకరిస్తామని అన్ని పార్టీలు స్పష్టం చేశాయి. ఐతే, సామాన్య ప్రజలపై పోలీసులు, సైనికులు అరాచకాలకు పాల్పడకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్నిడిమాండ్‌ చేశాయి.

కాశ్మీర్ లో అల్లర్ల వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు. కాశ్మీర్‌ లో అశాంతికి పాక్‌ ప్రోద్బలమే కారణమని రాజ్యసభలో చెప్పారు. జమ్ముకాశ్మీర్‌ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాజ్యసభలో ఈ అంశంపై చర్చించారు. చర్చ సందర్భంగా ప్రభుత్వం తరఫున హోంమంత్రి రాజనాథ్‌ సింగ్ సమాధానమిచ్చారు. భారత్‌ లో ముస్లింల గురించి పాక్‌ ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ముస్లింల రక్షణ బాధ్యత ఇక్కడి ప్రభుత్వం చేపడుతుందని, దీని గురించి ప్రశ్నించే అర్హత పాకిస్థాన్‌ కు లేదని తేల్చిచెప్పారు. కాశ్మీర్లో అల్లర్లు తమ ప్రభుత్వాన్ని ఎంతో బాధించాయని, రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.