
తమిళనాడులో అమ్మ పేరుతో సిఎం జయలలిత చేపడుతున్న కార్యక్రమాల గురించి దేశం మొత్తం తెలుసు. తాజాగా జయలలిత సర్కారు పేదల కోసం ఓ కొత్త స్కీము ను ప్రవేశపెట్టింది. పేద ప్రజలకు వినోదాన్ని దగ్గర చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మల్టీప్లెక్స్, మాల్స్ ఎక్కువగా పెరిగిపోవడం, సినిమా చూడాలంటే రూ. 125 పైనే చెల్లించాల్సి వుండటంతో జయలలిత పేదల కోసం ‘అమ్మ సినిమా హాల్స్’ కాన్సెప్టును తెరపైకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం చెన్నైలోని మల్టీప్లెక్సుల్లో తెరముందు ఒక వరుస సీట్లు రూ. 10కే విక్రయిస్తున్నప్పటికీ, సీట్ల సంఖ్య తక్కువ ఉండడంతో పేదలు వినోదాన్ని పొందలేకపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇక జయలలిత సూచనల మేరకు చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచేలా రెండు థియేటర్లు ప్రారంభమయ్యాయి. టీ నగర్, పెనాయ్ నగర్ లో భారీ థియేటర్లను సిద్ధం చేసింది. దాదాపు 3 వేల మంది ఒకేసారి సినిమా చూసేలా పెనాయ్ నగర్, కలై అరంగం హాల్ ను రూ. 17 కోట్లకు పైగా ఖర్చు చేసి మార్పులు చేర్పులు చేశారు. అక్కడ టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 30 మధ్య మూడు క్లాసులుగా ఉంటుంది. డీటీఎస్ వంటి సదుపాయాలూ ఉంటాయి. వీటితో పాటు ముగప్పేర్, చేట్ పట్ ప్రాంతాల్లోనూ ‘అమ్మ హాల్స్’ నిర్మించే యోచనలో జయలలిత ప్రభుత్వం ఉంది.