తిరిగబడ్డ ఆర్మీని తరిమికొట్టిన టర్కీ

ఓ ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు అన్నది ఎంత వాస్తవమో.. ఓ విప్లవం కూడా ప్రపంచాన్ని మార్చగలదు అన్నది కూడా అంతే నిజం. బ్రతికినా చచ్చినట్లు బతకడం కంటే, చచ్చినా ప్రశాంతంగా ఉండాలి అనేది ఎంతో మంది భావన. ఇదే ఆలోచనతో ఇప్పుడు ప్రజా విప్లవానికి తెర తీసింది టర్కీ సైన్యం. ఈ  తిరుగుబాటును అక్కడి ప్రజలు గట్టిగా అడ్డుకున్నారు. ప్రజా విజయంగా అంతర్జాతీయ సమాజం దీనిని ఎంతో మెచ్చుకుంది. 

టర్కీలో సైనిక తిరుగుబాటు కొద్దిసేపట్లోనే ముగిసినా దాదాపు 190 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1440 మంది గాయపడ్డారు. తిరుగుబాటును అణచేశాక అధ్యక్షుడు రెకెస్ ఎర్డోగాన్ కు అనుకూలంగా ఉన్న దళాలు దాదాపు 2839 మందిని అరెస్ట్ చేశాయి. వీరిలో టాప్ ర్యాంకింగ్ సైనికాధికారులు కూడా ఉన్నారు. ఆర్మీ లో ఓ వర్గం అధ్యక్షుడి విధానాలను నిరసిస్తూ తిరగబడింది. యుద్ధ ట్యాంకులను సైతం వీధుల్లోకి నడిపించింది. ఆర్మీ ఛీఫ్ ను బందీ చేసింది. ప్రభుత్వ అనుకూల కల్నల్ లను నిర్బంధించింది. మైకు ద్వారా ప్రజలను ఉద్దేశించి- ప్రభుత్వాన్ని కూలదోశామని, కొత్త మిలటరీ ప్రభుత్వం వెంటనే బాధ్యతలు తీసుకుందని ప్రకటించింది.

హాలీడే గడపడానికి కొన్ని దీవులకు వెళ్ళిన అధ్యక్షుడు ఎర్డోగాన్ వెనువెంటనే ప్రజలకు ఓ సందేశం పంపారు. ఇది మన దేశం… ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మనుగుడ లేదు, ఆర్మీని ఎదుర్కోండి.. ట్యాంకులను ముందుకు పోనివ్వకండి..యుద్ధ విమానాలను ఆపండి.. మీ దేశాన్ని మీరే కాపాడుకోవాలి.. అని పిలుపునిచ్చారు. దీనితో ప్రజలు వెంటనే ఉన్న పళంగా వీధుల్లోకొచ్చేశారు. ట్యాంకులను అడ్డుకున్నారు. రెబెల్ ఆర్మీ ని అడ్డగించారు. ప్రతిఘటన తారాస్థాయికి వెళ్ళింది. 

ఓ హెలికాప్టర్ ను రెబెల్స్ కూల్చేశారు. పార్లమెంట్ పై బాంబు విసిరారు. ప్రజలు లక్షల సంఖ్యలో తమకు ఎదురు తిరుగుతారని తిరుగుబాటు దారులు ఊహించలేదు. తమ తుపాకులు చూసి బెదిరిపోతారనుకున్నారు.. కానీ ఊహించనిది జరిగింది. వెంటనే తోక ముడిచారు. హెలికాప్టర్ ద్వారా కాల్పులు జరిపి దాదాపు వందమంది పోలీసులను మట్టుబెట్టినా చివరకు అదే పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రజలు ట్యాంకులు ఎక్కి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇటీవల కాలంలో ప్రజా సమూహం ఓ సైనిక తిరుగుబాటును ఎదుర్కొని ఓడించడం ఇదే మొదటిసారి.