
ఫ్రాన్స్ లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులతో కూడిన ఓ ట్రక్కు వల్ల దాదాపుగా 84 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్‌లో టూరిస్ట్ ప్లేస్ నీస్ సిటీలో ప్రజలంతా ఫ్రాన్స్ దినోత్సవం (బాస్టిల్ డే) సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కనుల పండుగ గా బాణా సంచా పేలుస్తూ ఉన్నారు. ఈ లోగా ఓ ట్రక్కు యమ వేగంగా ప్రజలపైకి దూసుకువచ్చింది. అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో భారీ ట్రక్కు ప్రజలను ఢీకొంటూ వెళ్లడంతో 80 మందికి పైగా మృతి చెందారు.
తొక్కిసలాటలు, ఈ వాహనం కింద పడి దెబ్బలు తగలడంతో వంద మందికి పైగా గాయపడ్డారు. క్షణాలలోనే ఇది ఉగ్రవాదపు దుశ్చర్యగా నిర్థారించుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరపగా ఆ వ్యక్తి చనిపోయాడు. ట్రక్కులో నక్కి ఉన్న ఇతర వ్యక్తులకు, పోలీసు బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే ట్రక్కు అతి వేగంగా వెళ్లడంతో అప్పటికే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. కొత్త తరహా ఉగ్రవాద దాడిగా దీనిని నిర్థారించుకున్న స్థానిక అధికారులు నైస్ నగరాన్ని యాంటీ టెర్రరిస్టు స్కాడ్‌కు అప్పగించారు.
ట్రక్కు 70 కిలోమీటర్లకు పైగా వేగంతో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ దూసుకుపొయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రజల ప్రాణాలు తీసిన ట్రక్కు వెనుక భాగంలో భారీ ఎత్తున తుపాకులు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అత్యంత పకడ్బందీ వ్యూహంతో ఉగ్రవాదులు ప్రజలను టార్గెట్‌గా చేసుకుని ఈ తరహా దాడికి దిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు ఐసిస్ వెబ్ సైట్లలో కనిపించింది.