50రూపాయల టికెట్ కొంటే ‘కోటి’ లాటరీ తగిలింది

అదృష్టవంతుడిని ఆపలేరు.. దురదృష్టవంతుడిని మార్చలేరు అని ఓ సామెత ఉంది. చాలా మందికి అదృష్టం బంకలా అంటుకుంటుంది. తాజాగా అలాగే ఓ మహిళకు రబ్బర్ బంకలాగా అంటుకుంది అదృష్టం. యాభై రూపాయలు పెట్టి కొంటే ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలింది. అసలు కోటి రూపాయల లాటరీ తగిలింది అంటే నమ్మని ఆమె తర్వాత తేరుకొని సంతోషపడింది. లక్ వచ్చి లక్కబంకలా అతుక్కోవడం అంటే ఇదే మరి. ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరో  తెలుసా..? ఏం చేస్తుందో తెలుసా..?

రబ్బరుతోటలో పని చేసే  నబీసా అనే ఓ మహిళా కార్మికులిని ఊహించని రీతిలో అదృష్టం వరించింది. కేరళ ప్రభుత్వ లాటరీలో ఆమె కోటి రూపాయలు గెలుచుకుంది. 11వ ‘స్త్రీ శక్తి’ లాటరీ ద్వారా ఈ మొత్తాన్ని గెలుచుకుంది. నబీసా తిరువనంతపురం జిల్లాలోని కిలిమనూరు నివాసి. ఈమె ప్రతి ఏటా ప్రభుత్వం తరపున అమ్మే లాటరీ టిక్కెట్లను కొంటూ ఉంటుంది. తన అదృష్టాన్ని ఎప్పటికప్పుడూ పరీక్షించుకుంటూ ఉంటుంది. ఇలా ఆమె చాలాసార్లు రూ.1,000 గెలుచుకుంది.

కానీ ఈ సారి ఏకంగా కోటి రూపంలో అదృష్టం తలుపుతట్టింది. గెలుచుకున్న డబ్బుతో కొంత భూమి కొని, సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్నట్టు చెప్పింది. వికలాంగురాలైన తన చెల్లెలికి స్టేషనరీ షాప్ పెట్టిస్తానని చెప్పింది. ఈ లాటరీని గతంలో యుడిఎఫ్ ప్రభుత్వం నిరుపేద మహిళల సహాయార్థం ఆరంభించింది. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా వారానికి ఒకసారి డ్రా తీసే ఈ లాటరీ టికెట్ ధర రూ.50. ఈ టిక్కెట్ల ద్వారా సేకరించిన డబ్బుని ప్రభుత్వం ప్రత్యేకంగా వృద్ధులు, మహిళల సంక్షేమానికి ఉపయోగిస్తుంది.