మొత్తం మొదటి భార్యకే కట్టబెట్టిన దిగ్విజయ్ సింగ్

తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా దిగ్గీరాజా దిగ్విజయ్ సింగ్ అందరికి పరిచయం. ఆయన ఒక్క ఫోటోతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఆయనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు రాజకీయవేత్తగా ఆయనకు సంబంధించిన ఆస్తి మొత్తం తన మొదటి భార్య కుమారుడికే చెందుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తానొక్కడినే తీసుకోలేదని.. తన రెండో భార్య అమృతా రాయ్ ది కూడా ఇదే నిర్ణయమన్నారు.

రాజ్యసభ టీవీలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న అమృతా రాయ్‌తో ప్రేమలో పడ్డ ఆయన రెండేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే దిగ్విజయ్ సింగ్‌కు మొదటి భార్య ద్వారా జయవర్ధన్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తితో పాటు రాజకీయ వేత్తగా ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుందని ఏ ఒక్కరూ దిగ్విజయ్ ను ప్రశ్నించలేదు. అయినప్పటికీ ఆయన తన ఆస్తి మొత్తం మొదటి భార్య కుమారుడు జయవర్ధన్ సింగ్‌కే చెందుతుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అమృతా రాయ్ కూడా తనకు దిగ్విజయ్ కావాలి తప్ప ఆయన ఆస్తి కాదని ప్రకటించారు.