ప్రాణాలపైకి తెస్తున్న పోకెమాన్ గో గేమ్

పిచ్చి ముదిరి పాకాన పడటం అంటే ఇది. రియాల్టి మొబైల్ గేమ్ గా వచ్చిన పోకిమాన్ గో గేమ్ విడుదలైన వెంటనే ప్రపంచమంతటా పాపులర్ అయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవర్ని చూసిన ఈ గేమ్‌లో నిమగ్నమైపోతున్నారు. ఫోన్‌లో కనిపించే పోకిమాన్‌ని పట్టుకోవడమే ఈ ఆట ప్రత్యేకత. ఈ ఆట ఆడుతున్నప్పుడు తల పక్కకు తిప్పుకోలేం. ఇది యువతకు ఎంతలా నచ్చేసిందంటే తాజాగా ఓ యువకుడు ఈ గేమ్ ఆడుతుండగా ఓ ఆగంతకుడు అతన్ని కత్తితో పొడిచి పారిపోయాడు. అయినా ఆ యువకుడు గేమ్‌లో నిమగ్నమైపోయాడు.

ఓరెగాన్‌కి చెందిన మైకెల్ బేకర్ అనే యువకుడు ఓ పార్క్‌లో పోకెమాన్ గో గేమ్ ఆడుకుంటూ వెళుతున్నాడు. అక్కడికి వాకింగ్‌కి వచ్చిన ఓ వ్యక్తిని మీరు కూడా పోకిమాన్ గో ఆడుతున్నారా అని అడిగాడు. ఆ వ్యక్తి ఎందుకో కోపంతో కత్తితో బేకర్ భుజంపై పొడిచి పారిపోయాడు. రక్తం కారిపోతున్నా బేకర్ మాత్రం గేమ్ పూర్తిగా ఆడేవరకు ఆస్పత్రికి వెళ్లలేదు. ఆ తర్వాత తీరిగ్గా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోగా భుజానికి ఎనిమిది కుట్లు పడ్డాయి. ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఓ వ్యక్తి ఈ గేమ్ ఆడుకుంటూ వెళ్తూ ఓ చెరువులో పడిపోయాడు. ఇప్పటికే ఈ గేమ్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.