ఎంఐఎం పార్టీపై నిషేధం

మహారాష్ట్రలో ఏఐఎంఐఎం పార్టీకి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఆడిట్ చేసిన అకౌంట్లు సమర్పించనందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏఐఎంఐఎం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఎన్నికల కమిషన్‌కు అన్ని పత్రాలూ సమర్పించామని, అయినా కూడా ఈసీ ఆదేశాలు పూర్తిగా అందాక స్పందిస్తామని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ తెలిపారు.  ఏఐఎంఐఎంకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధినేత.

గత ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీగా ప్రకటించుకున్న ఎంఐఎంకి తాజా నిర్ణయం ఇబ్బంది కలిగించే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2015 లో జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం ఊహించని ఫలితాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఔరంగాబాద్ మున్సిపాలిటీలో ఏకంగా 24 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈసారి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని భావించిన ఎంఐఎంకి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది.
కాగా ఆడిట్ నివేదిక సమర్పించకపోతే మహారాష్ట్రలో రాజకీయ పార్టీగా ఉన్న ఎంఐఎం రిజిస్ట్రేషన్ ను రద్దుచేస్తామని ఈసీ ఇదివరకే హెచ్చరించింది. అయినా ఎంఐఎం పట్టించుకోలేదట. ఈసీ తాజా నిర్ణయంతో మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గుర్తుపై పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. స్వంతంత్రులుగా పోటీ చేసి, తర్వాత ఎంఐఎంలో చేరే ఛాన్స్ అయితే ఉంది.