
అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పట్టించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. అల్ ఖైదా తో అమెరికా పెత్తనం చెల్లదంటూ చేసిన ఉగ్రదాడిని ఎవరూ మరిచిపొలేరు. అయితే తాజాగా లాడెన్ కొడుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అమెరికా మీద ప్రతీకారం తీర్చుకుంటానన్నట్లు ఆడియో టేపులు విడుదలయ్యాయి. వీఆర్ఆల్ ఒసామా పేరుతో ఉన్న 21 నిమిషాలున్న ఆడియో టేపును ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది అల్‌ఖైదా. పాలస్తీనా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సోమాలియాతోపాటు ఇతర ముస్లిం దేశాల ప్రజలను అమెరికా అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని,.. దానికి తగిన ఫలితం అనుభవించాల్సిందేనని హమ్‌జా హెచ్చరించాడు.
అమెరికా మీద తమ దాడులను మరింత ఉదృతం చేస్తామని ఆ వీడియోలో ఉంది. ఒసామా బిన్ లాడెన్ కోసమే కాదు ఇస్లాంను రక్షించడానికి ప్రయత్నిస్తున్న అందరి తరఫున అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్నాడు. 9/11 దాడుల తర్వాత పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో తలదాచుకుంటున్న లాడెన్‌ను 2011లో అమెరికా సైనికులు హతమార్చారు. అప్పటి నుంచీ అతని కొడుకు హమ్‌జా నేతృత్వంలో అల్‌ఖైదాను మళ్లీ ఒక్కటి చేయాలని ఆ ఉగ్రవాద సంస్థ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు.