
మామూలుగా అయితే బకెట్ల నిండా నీళ్లు నింపుతుంటారు. కానీ ఓ ఇంట్లో మాత్రం బకెట్ల నిండా డబ్బులు ఉన్నాయి. అది కూడా ఒకటి రెండు బకెట్లు కాదు ఏకంగా 24 బకెట్ల నిండా డబ్బులే. గార్డెన్ సామాన్లను అమ్ముతున్న వ్యాపారి లూయిస్ హెర్నాండెజ్ గాంజలెజ్ ఇంటి అటకపై అంత డబ్బును చూసి, విచారణ కోసం వచ్చిన పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఫ్లోరిడాలోని మియామీలో చోటుచేసుకున్న ఈ ఘటన, అక్కడ జరుగుతున్న అక్రమ వ్యాపారానికి సాక్ష్యంగా నిలిచింది.
అక్రమ వ్యాపారంతో సంపాదించిన సొమ్ము సుమారు 20 మిలియన్ డాలర్లును ఆ బకెట్లలో దాచిపెట్టాడు లూయిస్. ఆ సొమ్ముతో పాటు అత్యంత ఖరీదైన ఒక తుపాకీ, కొన్ని మాదక ద్రవ్యాలు కూడా ఆ బకెట్లలో ఉండటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. వ్యాపారి గాంజలెజ్ తో పాటు ఆయన సోదరి 32 సంవత్సరాల సల్మా గాంజలెజ్ ను కూడా అరెస్టు చేశారు. డబ్బు బకెట్లను, డ్రగ్స్ ను, ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.