మోడీ బట్టల కోసం 70 కోట్లు?

మోడీని టార్గెట్ గా చేసుకునే ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే ఈ సారి మోదీ దుస్తుల గురించి పెద్ద చర్చకు తెర తీశారు. మోదీ దుస్తుల ఖరీదు ఏకంగా 70 కోట్లు అంటూ కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనం రేపింది. ప్రతి రోజు మోడీ రూ. 2 లక్షల ఖరీదు గల దుస్తులు ధరిస్తారని ఆయన అన్నారు. రోజుకు ఐదు సార్లు డ్రెస్సులు మారుస్తారని, సగటున ఆ డ్రెస్సుల వ్యయం రూ.పది లక్షలని తెలిపారు. మోడీ అధికారం చేపట్టి 700 రోజులైందని ఇప్పటి వరకు దుస్తులకైన వ్యయం అక్షరాలా 70 కోట్లని వివరించారు. మరో 5 కోట్ల రూపాయల విలువ గల మిగిలిన దుస్తులు కూడా మోడీ ధరించారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఒక సారి వేసుకున్న దుస్తులను ఉతకరని, మళ్లీ వాటిని ఉపయోగించరని సీఎం వివరించారు. ఢిల్లీలో తాము అన్ని ప్రభుత్వ శాఖల అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కోసం రూ.76 కోట్లు మాత్రమే వ్యయం చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రూ. 526 కోట్లు వ్యయం చేస్తున్నట్టు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రధాని మోడీ దుస్తుల కోసం వ్యయం చేస్తున్నా, దాని గురించి రాసేందుకు మీడియా జంకుతున్నదన్నారు. మొత్తానికి మరోసారి మోడీ మీద తనదైన స్టైల్లో కొత్త కాన్సెప్ట్ తో వివాదాన్ని రేపాడు అరవింద్ కేజ్రీవాల్. మరి దీని నుండి మోడీ, ఆయన ప్రభుత్వం ఎలా తప్పించుకుంటుందో చూడాలి.