నేను స్వాతిని మాట్లాడుతున్నా..

నేను స్వాతిని మాట్లాడుతున్నాను అంటూ ఓ వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. సడన్ గా వాట్సాప్ మెసేజెస్ ను ఓపెన్ చేస్తే అందులో ఆ మాటలు విన్న వాళ్లంతా ఏడ్చేస్తున్నారు మగాళ్లను కన్న తల్లులు తమ పిల్లలకు ఏం చెప్పాలో.. ఏం చెయ్యాలో అంటూ ఒక్క నిమిషం ఆలోచించేటట్లు చేసింది ఆ మెసేజ్. చెన్నైలో నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో గత శుక్రవారం ఐటీ ఉద్యోగిని స్వాతి దారుణహత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ గ్రూపుల్లో ‘నేను స్వాతిని మాట్లాడుతున్నాను’ అంటూ తమిళంలో వినిపించే ఆ మెసేజ్ తెలుగులో..

"చనిపోయిన నేను ఇంకా కొద్దిరోజులు ప్రసార మాధ్యమాల ద్వారా మీ మధ్య జీవిస్తూనే ఉంటాను. అంతకుముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడి వెళ్లాలని ఆశిస్తున్నాను. అందరిలాగే కలలతో జీవితాన్ని ప్రారంభించిన సమకాలీన సమాజంలో నేను ఒక వ్యక్తిని. ఈరోజు నేను ఎప్పటిలాగే ఉద్యోగానికి బయలుదేరాను, వారాంతపు రోజులను ఆనందంతో గడపాలని భావించే కలతో… మా నాన్న కూడా అలాగే భావించి నన్ను రైల్వేస్టేషన్లో దిగబెట్టి వెళ్లారు. మీలో ఎంతమంది ఈ రోజు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి ఉంటారనే విషయం నాకు తెలియదు. అయితే అది మీ మనస్సాక్షికి తెలుసు. మీలో ఎంతమంది మహిళా సాధికారత కోసం నోరు చిరిగేలా మాట్లాడి ఉంటారో నాకు తెలియదు. ఈరోజు నేను నోరు చిరిగే ఉన్నాను. అయితే మీలో ఒకరికి కూడా దానిని (హత్యను) అడ్డుకోవాలనే ఆలోచన రాలేదు. అతడు (హంతకుడు) వెళ్లిన తర్వాత నాకు చికిత్స అందించడానికో లేక నా దాహార్తిని తీర్చడానికో ఒక్కరూ ముందుకు రాలేదు. రెండు గంటల పాటు నన్ను చోద్యం చూసిన దృశ్యాలు మిమ్మల్ని దహించలేదా? ఆడపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ‘చూసి వెళ్లు’ అని చెప్పే మీరు దానిని మగపిల్లలకు కూడా చెప్పండి. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను మొగ్గ దశలోనే తుంచేయండి’… అని సాగింది.

ఈ మెసేజ్ నిజంగా అందరూ చదవాలి. ఎప్పడో నిర్భయలాంటి ఘటన జరిగినప్పుడు మాత్రమే సందట్లో సడేమియాలాగా అరవడం కాకుండా... ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నిజానికి నేరాలు అనేవి ఎవరో బయటి నుండి వచ్చి చెయ్యరు.. మనలోనే ఒకరు నేరాలకు పాల్పడుతున్నారు. పుట్టుకకు కారణమైన ఆడదానిపై... అదే ఆడతనం కోసం మగాడు పశువుగా మారి... కాటేస్తున్నాడు. దేశంలో ఎన్నో సమస్యల్లో ఇది ఓ సమస్య అనుకునే చవటలు దేశంలో ఎంతో మంది ఉన్నారు కానీ అలాంటి చవటల జాబితాలో మీరు లేకుండా చూసుకోండి. మన తల్లికి, మన చెల్లికి ఇలాంటివి జరిగేంత వరకు చూస్తూ కుర్చోవడం మంచిది కాదు. అలాంటి విపరీతమైన ఆలోచనలు చేస్తున్న వారిని మొగ్గ దశలోనే తుంచెయ్యడం మంచిది.