మందు తాగి.. డ్యాన్స్ చేసిన మంత్రిగారు

మందేస్తూ.. చిందెయ్ రా.. చిందేస్తూ మందెయ్ రా.. అన్న దానికి ఓ మంత్రిగారు బాగా కనెక్ట్ అయినట్లున్నారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని ద్యాస కూడా మరిచి తప్పతాగి చిందులు వేశారు.  ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు లుంగీతో చేసిన అసభ్యకరమైన డాన్స్ అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. అయ్యాగారి చిందుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మహమ్మద్ ఫారూఖ్ హసన్ నిర్వాకమిది. కట్టుకున్న లుంగీని ఆయన అడపాదడపా సరిచేసుకుంటూ మధ్యలో ఊడదిస్తూ....ఓ దశలో సోఫాలో పడిపోయినా మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చిందులేస్తుండగా కొందరు చప్పట్లు చరుస్తూ ఆయనను ప్రోత్సహించారు.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మహ్మద్ పారుఖ్ హసన్ గారు చేసిన నిర్వాకం మీద సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వచ్చాయి. అయ్యగారి డాన్స్ ప్రోగ్రాం ఎప్పుడు, ఎక్కడ జరిగిందనేది తెలియదు కానీ, ఆ వీడియాను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మంత్రి చేష్టలపై విమర్శలు వెల్లువలా వచ్చాయి.   అయితే సదరు మంత్రివర్యులకు ఇది కొత్తేం కాదనీ...గతంలోనూ ఆయన ఇలాంటి నిర్వాహకులు చేశారని స్థానికులు అంటున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి మత్తు విదిలించుకొని లబోదిబోమంటున్నారు. తనపై ఎవరో కుట్ర చేశారని, పాంచ్లీ ప్రాంతానికి చెందిన కొందరు యువకులే ఈ పనికి పాల్పడ్డారని, డబ్బులివ్వాలంటూ తనను బ్లాక్‌మెయిల్ చేశారని మహమ్మద్ ఫారుఖ్ హసన్ నమ్మబలుకుతున్నారు. అయ్యగారి చిందులు మీరూ చూడండి.