
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG) లో సభ్యత్వం కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నం తుది దశకు చేరుకుంది. సౌత్ కొరియా రాజధాని సియోల్ లో జరగనున్న న్యూక్లియర్ సప్లయర్స్ ప్లీనరీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. భారత్ తరఫున బిడ్ దాఖలు చేయటానికి విదేశాంగ కార్యదర్శి జై శంకర్ సియోల్ చేరుకున్నారు. మొత్తం 48 దేశాల ఈ కూటమిలో ఎక్కువ దేశాలు మద్దతిస్తే భారత్ కు సభ్యత్వం దక్కనుంది. ఐతే ప్రధాన దేశమైన అమెరికా ఈ విషయంలో భారత్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచింది. కొన్ని రోజుల క్రితమే ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ… స్విట్జర్లాండ్, మెక్సికో, కెనడా లాంటి దేశాలు భారత్ కు మద్దతిచ్చేందుకు అంగీకరించేలా రాయబారం నడిపారు.
భారత్ ఈ కూటమిలో చేరకుండా చైనా ప్రధానంగా అడ్డుపడుతోంది. అటు పాకిస్థాన్ సైతం భారత్ కు సభ్యత్వం దక్కకుండా ఉండేందుకు చైనా తరుఫు నుంచి నరుక్కొస్తోంది. చాలా దేశాలు భారత్ కు మద్దతిస్తున్నప్పటికీ అణ్వస్త్ర నిరోధక వ్యాప్తి ఎన్.పి.టి లో లేని భారత్ కు సభ్యత్వం ఎలా ఇస్తారని చైనా ప్రశ్నిస్తోంది. భారత్ కు తాము వ్యతిరేకం కాదంటూనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని కూటమిని హెచ్చరించింది.
సియోల్ లో రెండు రోజుల ఎన్‌ఎస్‌జీ ప్లీనరీ నేపథ్యంలో… భారత్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా సభ్య దేశాలను అమెరికా కోరింది. చైనా మాత్రం భారత్ కు నిబంధనలు సడలిస్తే అవే నిబంధనలు పాకిస్థాన్ కు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో భారత్ కు సభ్యత్వం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి భారత్ కు 20 దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. మరికొన్ని దేశాలు ఎటూ తేల్చుకోలేదు. చైనా సహా కొన్ని దేశాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్థాన్ మాత్రం…ఎన్.ఎస్.జి లో భారత్ కు సభ్యత్వం రాకుండా అడ్డుకున్నామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూక్లియర్ సప్లయర్స్ ప్లీనరీలో ఏం జరుగుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.