భారత్‌లో మొట్ట మొదటిసారిగా ‘హైడ్రోజన్’ ఇందనంతో నడిచే రైలు జనవరిలో ప్రారంభం కాబోతోంది. హర్యానా రాష్ట్రంలో పానిపట్-జింద్ స్టేషన్ల మద్య (90 కిమీ) దీనిని ప్రయోగాత్మకంగా నడిపించబోతున్నారు. డీజిల్ ఇంజన్ల వలన రైల్వేశాఖకి విపరీతమైన ఆర్ధిక భారంతో వాతావరణ కాలుష్యం అవుతున్నందున వాటి స్థానంలో విద్యుత్ రైళ్ళని నడిపిస్తోంది.
వాటి కంటే తక్కువ ఖర్చుతో ఈ హైడ్రోజన్ రైళ్ళు నడుస్తాయి కనుక రైల్వేశాఖ జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో సొంతంగా ఈ హైడ్రోజన్ రైళ్ళను తయారుచేసుకుంటోంది. ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్లు చొప్పున రూ. 2,800 కోట్లతో మొత్తం 50 రైళ్ళను తయారుచేయిస్తోంది. వాటిలో ముందుగా సిద్దమైన హైడ్రోజన్ రైలునే జనవరిలో ప్రయోగాత్మకంగా నడిపించబోతోంది.
ప్రపంచంలో రష్యా, చైనా, జర్మనీ మరో రెండు దేశాలలో మాత్రమే ఈ రకం రైళ్ళు తయారు చేసుకొని నడిపించుకుంటున్నాయి. ఇప్పుడు వాటి సరసన భారత్ కూడా చేరబోతోంది.
నీటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసి దానిని ఆక్సిజన్‌తో కలిపినప్పుడు శక్తి విడుదలవుతుంది. దాంతో ఈ రైళ్ళు నడుస్తాయి. ఈ రైళ్ళు గంటకు 140 కిమీ వేగంతో ప్రయాణించగలవు. వీటిని దేశంలోని డార్జిలింగ్, నీలగిరి తదితర హిల్ స్టేషన్స్, పర్యాటక ప్రాంతాలలో నడిపించాలని రైల్వేశాఖ భావిస్తోంది. హైడ్రోజన్ రైళ్ళు విజయవంతమైతే క్రమంగా విద్యుత్ రైళ్ళ స్థానంలో వీటిని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది.