లండన్ నగరంలో థేమ్స్ నది మీద నిర్మించిన ప్రఖ్యాత టవర్ బ్రిడ్జిలో ఓ సాంకేతిక లోపం ఏర్పడింది. నదిలో పెద్ద షిప్పులు వచ్చినప్పుడు ఆ వంతెన మద్యలో రెండుగా విడిపోయి పైకి లేచి దారి కల్పిస్తుంది. షిప్పులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వంతెన రెండు భాగాలు క్రిందకు దిగుతుంటాయి. అప్పుడు ఆ వంతెనపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతుంటాయి.
ఈ ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిని 1894లో నిర్మించారు. బ్రిడ్జికి రెండు వైపులా 200 అడుగుల ఎత్తుగల టవర్స్ నిర్మించారు. వాటిలో అమర్చిన యంత్రాల ద్వారా వంతెన రెండు భాగాలను అవసరమైనప్పుడు పైకి లేపి క్రిందకు దింపుతుంటారు. దశాబ్ధాలుగా ప్రతీ రోజు ఇలాగే జరుగుతోంది. అయితే ఇవాళ్ళ వంతెన రెండు భాగాలు విడిపోయి పైకి లేచిన తర్వాత మళ్ళీ కిందకు దిగలేదు. దాంతో వంతెనకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంజనీర్లు దాదాపు అర్ధగంటసేపు కష్టపడి మరమత్తు చేసి వంతెన రెండు భాగాలను కిందకు దించారు.
ఆ రోజుల్లోనే ఇంత అద్భుతమైన టెక్నాలజీతో ఇటువంటి వంతెనను నిర్మించడమే కాకుండా, ఇప్పుడు అందరూ ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న స్కైవాక్‌ని కూడా అప్పుడే దానిపై అమర్చారు. వంతెనకు 200 అడుగుల ఎత్తులో దానిని ఏర్పాటుచేశారు. అందుకే లండన్ టవర్ బ్రిడ్జికి అంత ప్రసిద్ధి చెందింది.