ప్రపంచంలో కెల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జి కశ్మీరులో

June 25, 2022
img

ప్రపంచంలో కెల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కశ్మీరులో చినాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్ కంటే మరో 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్రమట్టం నుంచి 359 మీటర్లు ఎత్తులో 1.315 మీటర్లు పొడవుతో దీనిని నిర్మిస్తున్నారు. రూ.28,000 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ చినాబ్ రైల్ బ్రిడ్జి నిర్మాణ పనులు 88 శాతం పూర్తవడంతో రైల్వే మంత్రిత్వ శాఖ దానికి సంబందించిన తాజా ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

కశ్మీరులో శీతాకాలంలో నెలల తరబడి భారీగా మంచు కురుస్తుంటుంది. ఈ సమయంలో ఉదంపూర్, శ్రీనగర్ బారాముల్లా తదితర ప్రాంతాల మద్య రాకపోకలు నిలిచిపోతుంటాయి. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన ఈ సమస్యకు శాశ్విత పరిష్కారంగా ఈ రైల్ బ్రిడ్జి ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వం రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఎన్నివేల కోట్లు ఖర్చు చేసినా అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులలో, అత్యంత ప్రమాదకరమైన రెండు కొండల నడుమ 1.3 కిమీ పొడవున బ్ర్రిడ్జిని నిర్మించడం ఇంజనీర్లకు పెనుసవాలుగానే నిలిచింది. 

పైగా అంత ఎత్తులో బ్రిడ్జి నిర్మించినా అది గంటకు 100-120 కిమీ అంతకంటే వేగంతో వీచే బలమైన ఈదురుగాలులు తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. లేకుంటే ఇన్నివేల కోట్ల పెట్టుబడి, ఇంజనీర్లు, కార్మికుల శ్రమ అన్నీ వృధా అయిపోతాయి. కనుక ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు డిఆర్‌డివో సలహాలు, సూచనలు, సహకారం తీసుకొని నిర్మిస్తున్నారు. 

అంత ఎత్తులో బ్రిడ్జిపై ప్రయాణికులతో రైలు ప్రయాణిస్తున్నప్పుడు గంటకు 266 కిమీ వేగంతో గాలులు వీచినప్పటికీ తట్టుకొనే విదంగా నిర్మించారు. అంతేకాదు... ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఈ బ్రిడ్జిపై నుంచి రైలు ప్రయాణించగలదు. త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణపనులు పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తే కాశ్మీర్‌, ఉదంపూర్, శ్రీనగర్ బారాముల్లా తదితర ప్రాంతాలలో నివసించే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. 



Related Post