తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇస్రో ప్రయోగం

February 27, 2021
img

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థతో కలిసి రేపు అంతరిక్షరంగ వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. ఆ సంస్థకు చెందిన 13 ఉపగ్రహాలను ఇస్రో రేపు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతోంది. 

ఎప్పటిలాగే తన నమ్మినబంటు పీఎస్‌ఎల్‌వీ (సీ51) ద్వారా రేపు ఉదయం 10.24 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మొత్తం 18 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది. రేపటి ప్రయోగానికి  ఈరోజు ఉదయం 8.54 గంటల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్‌ ప్రారంభించారు.  

ఈ తొలి వాణిజ్య ప్రయోగంలో అమెరికాకు చెందిన స్పేస్ బీఎస్ పేరుతో 12 ఉపగ్రహాలు, బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా-1 అనే ఒక ఉపగ్రహం, యూనిటీశాట్ పేరిట మూడు యూనివర్సిటీల విద్యార్దులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, ఇంకా సతీష్ ధావన్‌ శాట్, సిందునేత్ర అనే మరో రెండు ఉపగ్రహాలు కలిపి మొత్తం 18 ఉపగ్రహాలున్నాయి. 

 బ్రెజిల్, అమెరికాలకు చెందిన 13 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టినందుకు ఇస్రోకు భారీ ఆదాయం సమకూరనుంది. ఇప్పటివరకు ఇస్రో ఎన్నో ఉపగ్రహాలను అతితక్కువ ఖర్చుతో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టినందున, అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రోకు తిరుగు ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Related Post