భారత్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఈరోజు (బుధవారం) రాత్రి జరుగబోయే ఫైనల్స్‌లో ఆమె అమెరికా రెజ్లర్ సారా హిల్డేబ్రాంట్‌తో పోటీకి సిద్దమవుతుండగా, ఆమె బరువు చెక్ చేసిన నిర్వాహకులు 50 కేజీలకు 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నారని గుర్తించడంతో ఆమెపై అనర్హత వేటు వేస్తున్నట్లు ఒలింపిక్స్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ ప్రకటించాయి.
మంగళవారం జరిగిన ప్రీ-క్వార్టర్స్‌కు ముందు ఆమె 50 కేజీలు బరువు ఉన్నట్లు ధృవీకరించుకున్న తర్వాతే నిర్వాహకులు ఆమెను పోటీలో పాల్గొనేందుకు అనుమతించారు. కానీ మంగళవారం రాత్రికి కొంత అదనపు బరువు ఉన్నట్లు గ్రహించిన వినేష్ ఫోగట్ అది తగ్గించుకోవడం కోసం రాత్రంతా మేల్కొని జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ వగైరా చేస్తూనే ఉంది. అయినా బుధవారం ఉదయం 100 గ్రాములు బరువు అదనంగా ఉన్నందున ఆమెపై అనర్హత వేటు పడింది. వినేష్ ఫోగట్‌తో పాటు ఆమె అభిమానులు, భారతీయులు తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.
ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని, ఆమెకు మరొక 1-2 గంటలు సమయం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్స్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. కానీ ఒలింపిక్స్ కమిటీ నిరాకరించినట్లు తాజా సమాచారం. కనుక వినేష్ ఫోగట్ ఫైనల్స్ వరకు పతకం లేకుండానే స్వదేశానికి రాకతప్పడం లేదు.
తనపై అనర్హత వేటు పడిందని తెలియగానే వినేష్ ఫోగట్ షాక్ అయ్యింది. రాత్రంతా నిద్రపోకుండా నీళ్ళు త్రాగకుండా వ్యాయామం చేయడంతో తీవ్ర డీహైడ్రేషన్‌కు గురయ్యి స్పృహ తప్పి పడిపోయింది. ఒలింపిక్స్ గ్రామంలోనే గల హాస్పిటల్‌లో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.