హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీకి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టినప్పుడు హెచ్‌సీఏ ప్రస్తుత కమిటీని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. మళ్ళీ కొత్త కమిటీ ఎన్నికయ్యే వరకు జస్టిస్ లావు నాగేశ్వరరావుని ఏక సభ్య కమిటీగా నియమిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఆయన నేతృత్వంలోనే హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గతంలో ఆయనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియని పర్యవేక్షించిన అనుభవం ఉన్నందున ఆయనకి ఈ బాధ్యత అప్పగించాలని, ఆయనైతేనే హెచ్‌సీఏ ఎన్నికలకు అసలైన ఓటర్లని గుర్తించి ఎంపిక చేయగలరని సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ దవే చేసిన సూచనలని హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని జస్టిస్ లావు నాగేశ్వరరావుకి కీలకమైన ఈ బాధ్యతలు అప్పగించింది. ఆయన చేసిన సిఫార్సుల మేరకు తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం తెలియజేసింది.