యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ తొలి ట్వీట్

January 17, 2023
img

గత నెల రూర్కీ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ మెల్లగా కొలుకొంటున్నాడు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఉన్న ఆయనకి వైద్యులు ఈ నెల 7వ తేదీన మోకాలికి శస్త్ర చికిత్స చేశారు. మరో వారం రోజులలోగా పంత్‌ని వాకర్ సాయంతో నడిపిస్తారని తర్వాత హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని బిసిసిఐ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా రిషబ్ పంత్ ట్వీట్ చేశాడు. 

“నాకు అండగా నిలిచి నేను కోలుకోవాలని కోరుకొన్న ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా శస్త్రచికిత్స విజయవంతం అయ్యింది. నేను క్రమంగా కోలుకొని భవిష్యత్‌ సవాళ్ళని ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నాను. నాకు ఎంతగానో సహాయపడిన బీసీసీసీఐకి, జైషాకి, ప్రభుత్వాధికారులకి కృతజ్ఞతలు,” అని ట్వీట్ చేశారు. 

రిషబ్ పంత్ కారు ప్రమాదం జరిగి మంటల్లో చిక్కుకొన్నప్పుడు అటుగా వెళ్తున్న హర్యానా రోడ్ రవాణా సంస్థ బస్సు డ్రైవర్ రజత్ కుమార్, నిషు కుమార్‌ అనే మరో యువకుడు కలిసి అతనిని కారులో నుంచి బయటకి తీసుకువచ్చి వెంటనే హాస్పిటల్‌లో చేర్చడంతో వైద్యులు సకాలంలో చికిత్స అందించగలిగారు. ఆపత్సమయంలో తన ప్రాణాలు కాపాడినవారిద్దరికీ రిషబ్ పంత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొన్నాడు. హర్యానా ప్రభుత్వం కూడా వారిరువురినీ ఘనంగా సన్మానించింది. 

ఈ ప్రమాదం రిషబ్ పంత్ మోకాలి లిగ్మెంట్ దెబ్బ తినడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి సరిచేశారు. అతను త్వరలోనే నడవగలుగుతాడు కానీ పూర్తిగా కోలుకొనేందుకు కనీసం 7-8 నెలల సమయం పట్టవచ్చు కనుక ఈ ఏడాదిలో జరిగే ఏ క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొనలేకపోవచ్చని తెలుస్తోంది.       

Related Post