ఫిభ్రవరిలో నా చివరి మ్యాచ్: సానియా మీర్జా

January 14, 2023
img

భారత్‌ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా త్వరలో రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీతో తాను రిటైర్ కాబోతున్నానని శుక్రవారం సానియా ట్విట్టర్‌ ద్వారా అభిమానులకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరేళ్ళ వయసు నుంచి నేడు 36 ఏళ్ళ వయసు వచ్చే వరకు మూడు దశాబ్ధాల తన టెన్నిస్ ప్రస్థానం ఏవిదంగా సాగిందో తెలియజేస్తూ సానియా ఓ లేఖని కూడా పోస్ట్ చేశారు. 

ఈ సుదీర్గ ప్రస్థానంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ మ్యాచ్‌లో విజయం సాధించి త్రివర్ణ పతాకంతో స్టేడియంలో నిలబడినప్పుడు తాను ఎంతో గర్వపడేదానినని సానియా తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఓ ఆడపిల్ల ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదని భావిస్తున్నానని సానియా ఆ లేఖలో పేర్కొన్నారు. నా ఈ ప్రస్థానంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా సానియా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో నా గ్రాండ్ స్లామ్ జర్నీ ప్రారంభించాను కనుక అక్కడే నా కెరీర్‌ ముగించాలనుకొంటున్నాని సానియా తెలిపారు. తనకి ఎంతో పేరు ప్రతిష్టలు, గౌరవం, అభిమానులను ఇచ్చిన ఈ టెన్నిస్‌ నుంచి రిటైర్ కాబోతుండటం చాలా బాధ కలిగిస్తోందని అయినా ఏదో ఓ రోజు తప్పదు కనుక ఫిభ్రవరిలో చివరి టోర్నీ ఆడి ముగించాలనుకొంటున్నానని సానియా మీర్జా లేఖ ద్వారా తెలియజేశారు. 

సానియా మీర్జా హైదరాబాద్‌లోని నాజర్ స్కూల్లో చదువుకొంటూ ఆరేళ్ళ వయసు నుంచే నిజాం క్లబ్‌లో టెన్నిస్ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికి సానియా వయసు తక్కువగా ఉందని శిక్షణ ఇచ్చేందుకు కోచ్ ఒప్పుకోకపోతే ఆమె తల్లి కోచ్‌తో పోట్లాడి మరీ శిక్షణ ఇచ్చేందుకి ఒప్పించారు. ఆనాడు ఆమె తల్లి చూపిన తెగువ, ఆ తర్వాత సానియా పట్టుదల, కఠోరశ్రమ, ఒడిదుడుకులని తట్టుకొని ముందుకు సాగే ధైర్యం కారణంగా నేడు ఆమె ఈ స్థాయికి ఎదిగారని చెప్పవచ్చు. 

2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి ప్రవేశించిన సానియా 2005లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఆడారు. తన సుదీర్గ ప్రస్థానంలో 50కి పైగా గ్రాండ్ స్లామ్స్ ఆడారు. వాటిలో ఆరుసార్లు డబుల్స్ మేజర్ టైటిల్స్ గెలిచారు. 2010 కామన్ వెల్త్ గేమ్స్ విమెన్స్ సింగిల్స్ రజత పతకం, 2015లో డబుల్స్  వరల్డ్ నంబర్:1 ర్యాంక్ సాధించారు. 

సానియా మీర్జా 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని వివాహం చేసుకొని దుబాయ్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత కూడా టెన్నిస్ పోటీలలో పాల్గొంటూనే ఉన్నారు. 2018లో కొడుకు (ఇజాన్) పుట్టాక ఆమె కెరీర్‌ నెమ్మదించింది. వయసు, గాయాలు కూడా ఆమె కెరీర్‌కి అవరోధాలుగా నిలుస్తుండటంతో టెన్నిస్ నుంచి రిటైర్ అవ్వాలని సానియా నిర్ణయించుకొన్నారు. 

ఇటీవల భర్తతో విభేధాలు ఏర్పడటంతో ఆమె కొడుకుతో దుబాయ్‌లో వేరేగా ఉంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాటిని వారిరువురూ దృవీకరించలేదు. ఖండించలేదు. సానియా దుబాయ్‌లో టెన్నిస్ అకాడమీని స్థాపించి నిర్వహిస్తున్నారు.       

Related Post