ఉప్పల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ .. అన్ని టికెట్లు ఆన్‌లైన్‌లోనే!

January 12, 2023
img

ఈ నెల 18న హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్ మద్య తొలి వన్డే మ్యాచ్ జరుగబోతోంది. హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ బుదవారం ఉప్పల్ స్టేడియంలో మీడియా సమావేశం నిర్వహించి,  ఈ వన్డే  మ్యాచ్‌కి చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించారు. 

జనవరి 13వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 16 వరకు నాలుగు రోజులుపాటు ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసినవాళ్లు ఈ నెల 15 నుంచి ఎల్బీ స్టేడియం లేదా గచ్చిబౌలి స్టేడియం వద్ద తమ టికెట్స్ పొందవచ్చని తెలిపారు. 

ఉప్పల్ స్టేడియం సామర్ధ్యం (సీటింగ్ కెపాసిటీ) 39,112 కనుక దానిలో 29,417 టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని తెలిపారు. మిగిలిన 9,695 టికెట్లను ప్రముఖులకి కాంప్లిమెంటరీ పాసులుగా అందజేస్తామని తెలిపారు. ఈసారి బ్లాకులో టికెట్స్ అమ్ముకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని, ఒకరికీ నాలుగు టికెట్లు మాత్రమే విక్రయిస్తామని తెలిపారు. తొలిరోజున అంటే జనవరి 13న 6,000 టికెట్లు, తర్వాత రెండు రోజులు రోజుకి 7,000 టికెట్లు, చివరి రోజున అంటే జనవరి 16న 9,417 టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని తెలిపారు. నార్త్ పెవిలియన్ టెర్రస్ మీద ఉన్న సీట్లకి టికెట్‌ కనిష్ట ధర రూ.850, సౌత్ పెవిలియన్ కార్పొరేట్ బ్లాక్‌లో సీట్లకి గరిష్టంగా రూ.20,60 చొప్పున నిర్ణయించామని మహమ్మద్ అజహరుద్దీన్ విలేఖరులకి తెలిపారు. 

గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ఉప్పల్ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కోసం టికెట్లు అమ్మినప్పుడు హెచ్‌సిఏ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో జింఖానా మైదానంలో తొక్కిసలాటలు జరిగి పలువురు గాయపడ్డారు. కనుక మళ్ళీ అటువంటి ఘటనలు జరుగకుండా ఈసారి మొత్తం టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నామని మహమ్మద్ అజహరుద్దీన్ చెప్పారు.  

Related Post