అజారుద్దీన్‌పై బేగంపేట పోలీసులు కేసు నమోదు

September 23, 2022
img

నిన్న సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో భారత్‌-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల సందర్భంగా తొక్కిసలాటలు జరిగి 20మంది తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఏడుగురు చికిత్స పొందుతుండగా మిగిలినవారు డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు వెళ్ళిపోయారు. ముగ్గురు మహిళా బాధితుల ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఛైర్మన్‌ మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. హెచ్‌సీఏ బ్లాకులో టికెట్లు అమ్ముకోవడం, టికెట్ల అమ్మకాలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వలననే ఈ దుర్ఘటనలు జరిగాయని బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బేగంపేట పోలీసులు జింఖానా క్లబ్ నిర్వాహకులపై కూడా మరో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

అయితే హెచ్‌సీఏ ఛైర్మన్‌ మహమ్మద్ అజారుద్దీన్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంటే ఆఫీసులో కూర్చొని చెప్పినంత సులువు కాదు. దానిలో అనేక సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి పునరావృతం కాకుండా ఉండేందుకు వాటికి పరిష్కారం ఆలోచించాలే తప్ప ఒకరినొకరు వేలెత్తి చూపుకోవడం సరికాదు. ఈరోజు తొక్కిసలాటలో గాయపడిన వారందరికీ హెచ్‌సీఏ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మ్యాచ్ నిర్వహణలో ప్రభుత్వాన్ని కూడా భాగస్వామిగా చేస్తాము,” అని అన్నారు. 

 


Related Post