సికింద్రాబాద్‌ జింఖానాలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసులు లాఠీ ఛార్జ్

September 22, 2022
img

ఈ నెల 25 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మద్య టి-20 మ్యాచ్ సిరీస్ జరుగబోతున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో సిరీస్ జరుగబోతుండటంతో దాని కోసం హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ఐసీ) నేడు సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో టికెట్లు అమ్మబోతున్నట్లు ప్రకటించింది. దీంతో బుదవారం అర్దరాత్రి నుంచే వేలాదిమంది అక్కడకి తరలివచ్చి టికెట్స్ కోసం క్యూ కట్టారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి టికెట్స్ ఇవ్వడం ప్రారంభిచేసరికి కిలో మీటర్ల పొడవునా ప్రజలు బారులు తీరారు.

టికెట్ కౌంటర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా తోపులాటలు మొదలయ్యాయి. టికెట్ల కోసం వేలాది మంది యువతీయువకులు తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. టికెట్ల కోసం హెచ్ఐసీ నాలుగు కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేసింది. అదీ… మెయిన్ గేట్ లోపల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు 20 మంది చొప్పున లోపలకి అనుమతిస్తున్నారు. దీంతో క్యూలైన్లలో వెనుక ఉన్నవారిలో తమకు టికెట్లు దొరకవేమోననే ఆందోళన మొదలైంది. తోపులాట కూడా మొదలైంది. 

ఒక్కసారిగా వేలాదిమంది మెయిన్ గేట్ తోసుకొని లోపలకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో లోపల ఉన్న 120-150 మంది పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ తొక్కిసలాటలో అనేక మంది గాయపడగా కొందరు యువతులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ తోపులాటలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ అంబులెన్సులలో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.       

ఈరోజు జరిగిన త్రోక్కిసలాటలో పలువురు గాయడటంపై మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పరిస్థితులు అదుపుతప్పకుండా చూసేందుకు మరింతమంది పోలీసులను రప్పించి క్రికెట్ అభిమానులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Related Post