బంగారు పతకం సాధించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్

August 08, 2022
img

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించింది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ బౌట్‌లో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నెల్‌ను 5-0తో ఓడించి కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్ బౌట్ మొదలైనప్పటి నుంచి చివరివరకు నిఖత్ జరీన్‌దే పైచేయిగా ఏకపక్షంగా సాగింది. ఏ రౌండులోను కార్లీ మెక్‌నెల్‌ ఆధిక్యత సాధించలేక తడబడుతుంటే నిఖత్ జరీన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఆమెను ఎదుర్కొని పంచ్‌లు కురిపిస్తూ స్వర్ణ పతకం సాధించింది. 

కామన్ వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా పాల్గొన్న నీతూ గంగాస్ 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించడం విశేషం. ఈ పోటీలో ఆమె ఇంగ్లాండ్‌కు చెందిన 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య విజేత డెమీ జెడ్‌ను 5-0తో ఓడించింది. 

ఇక పురుషుల బాక్సింగ్‌లో 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ బంగారు పతకం సాధించాడు. ఇంగ్లాండ్‌ బాక్సర్ మెక్ డొనాల్డ్ ను 5-0తో చిత్తు చేశాడు. దీంతో ఆదివారం ఒక్కరోజునే ఒక్క బాక్సింగ్‌లోనే భారత్‌కు మూడు స్వర్ణాలు వచ్చాయి. 


Related Post