భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్ట్ జట్టుల కెప్టెన్‌గా మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈరోజు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్‌లో విడుదల చేసిన లేఖలో, “అన్ని ప్రయాణాలలాగే ఇది కూడా ఏదో ఒక రోజు ముగించవలసి ఉంటుంది. కనుక నేటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్స్ నుంచి నేను రిటైర్ అవుతున్నాను. నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి భారత్‌ను గెలిపించేందుకు అత్యుత్తమంగా ఆడాను. ఇంతకాలం నా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం లభించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.
ఇప్పుడు భారత్ మహిళా క్రికెట్ జట్టు అత్యుత్తమైన యువ క్రీడాకారుల చేతిలో ఉంది. జట్టుకి మంచి భవిష్యత్ ఉంది. కనుక నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను.
ఈ సందర్భంగా నాకు ఇంతకాలం సహాయసహకారాలు అందించిన బీసీసీఐకి, బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షాగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
ఇన్నేళ్ళపాటు భారత్ మహిళా జట్టుకి సారధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. తద్వారా నన్ను నేను తీర్చి దిద్దుకోవడమే కాక నా జట్టుని కూడా తీర్చిదిద్దగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.
నా ఈ ప్రయాణం ఇక్కడితో ముగిస్తున్నప్పటికీ నేను ఓ క్రికెట్ క్రీడాకారిణిగా మన దేశంలో, అంతర్జాతీయంగా కూడా మహిళా క్రికెట్‌ను ప్రోత్సహిస్తూనే ఉంటాను.
ఈ సందర్భంగా ఇంతకాలం నన్ను ఎంతగానో అభిమానించి ఆదరించిన నా అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని మిథాలీ రాజ్ వ్రాశారు.
మిథాలీ రాజ్ వయసు 39 కాగా దానిలో 30 ఏళ్ళు పూర్తిగా క్రికెట్‌లోనే గడిపారు. భారత్ మహిళా కెప్టెన్‌గా 23 ఏళ్ళు సారధ్యం వహించిన మిథాలీ రాజ్ 232 వన్డేలు ఆడి 7 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు చేశారు. మొత్తం 89 టీ20లు ఆడి 2,364 పరుగులు చేశారు. వాటిలో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 12 టెస్టులలో ఒక సేచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 699 పరుగులు సాధించారు. అన్నిటికీ మించి ఇన్నేళ్ళుగా క్రికెట్ ఆడుతున్నా ఫిట్‌నెస్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం విశేషం.