కారు ప్రమాదంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి

May 16, 2022
img

మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) శనివారం రాత్రి 10.30 గంటలకు క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లే వద్ద కారు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో కారులో సైమండ్స్ ఒక్కరే ప్రయాణిస్తున్నారు. 

ఇటీవలే మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో చనిపోగా ఆ తరువాత కొన్ని రోజులకే మరో మాజీ క్రికెటర్ రోడ్‌ మార్ష్ కూడా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. షేన్ వార్న్ మరణించినప్పుడు మొదట ఆ వార్తను ఎవరూ నమ్మలేకపోయారు. ఇప్పుడు ఆండ్రూ సైమండ్స్ మరణించారనే వార్తను కూడా ఎవరూ నమ్మలేకపోతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు మాజీ క్రికెటర్స్ చనిపోవడంతో ఆస్ట్రేలియన్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు. 

ఆండ్రూ సైమండ్స్ తొలిసారిగా 1998లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లతో తన కెరీర్ ప్రారంభించారు. తరువాత తొలిసారిగా శ్రీలంకతో 2004లో టెస్ట్ మ్యాచ్‌లో ఆడారు. 

సైమండ్స్ తన కెరీర్‌లో మొత్తం 198 వన్డేలు, 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. వన్డేలలో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో మొత్తం 5,088 పరుగులు చేశారు.  వన్డేలలో సైమండ్స్ 133 వికెట్స్ తీశారు. 

సైమండ్స్ ఆడిన 26 టెస్ట్ మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో మొత్తం 1,436 పరుగులు తీశారు. టెస్ట్ మ్యాచ్‌లలో 24 వికెట్లు తీశారు. 

సైమండ్స్ 14 టీ-20 మ్యాచ్‌లు ఆడి 337 పరుగులు చేసి 8 వికెట్లు తీశారు.    

సైమండ్స్ 2003,2007 జరిగిన ప్రపంచ కప్ పోటీలలో ఆడి ఆస్ట్రేలియాకు కప్ సాధించారు. సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పు కొన్నారు. 

ఐ‌పిఎల్ పుణ్యమా అని సైమండ్స్‌కు భారత్‌తో కూడా బలమైన అనుబందం ఏర్పడింది. మొదట హైదరాబాద్‌ డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడారు. తరువాత ముంబై ఇండియన్స్ తరపున ఆడారు. అందుకే సైమండ్స్ ఆకస్మిక మృతి పట్ల భారత్‌ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. బీసీసీఐ, ఐసీసీ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాయి. 

Related Post