మూడో వన్డేలో కూడా భారత్‌ గెలుపు

February 12, 2022
img

శుక్రవారం  అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై గెలిచి భారత్ పేటీఎం సిరీస్, కప్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత్ 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ జట్టు కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి సిరీస్ సొంతం చేసుకోవడం విశేషం. 

అంతకుముందు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు కాస్త తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించారు. దీంతో ఆ భారం తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్‌పై పడింది. టాప్ ఆర్డర్ బ్యాట్ మెన్ విఫలమైనప్పటికీ  మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 80, రిషబ్ పంత్ 56 పరుగులతో మెరిసారు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ కూడా చక్కటి  భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాషింగ్టన్ సుందర్ 33, దీపక్ చాహర్ 38 పరుగులతో  రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి పది వికెట్లు కోల్పోయింది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్‌కు 4 వికెట్లు పడ్డాయి. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ బ్యాట్ మెన్ను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. భారత బౌలర్ల ధాటికి వెస్టీండ్ జట్టు 37.1 ఓవర్లలో 169 పరుగులు చేసి పది వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచారు. ప్రసిద్ధ కృష్ణ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తాను ఆడిన 8 మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

ఇక ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అలాగే ప్రసిద్ధ కృష్ణకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.

Related Post