ఓటమితో ప్రారంభించి..గెలుపుతో అర్ధాంతరంగా ముగించి..

November 09, 2021
img

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత జట్టు ఓటమితో ప్రారంభించి విజయంతో ముగించింది. సోమవారం రాత్రి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారత జట్టు పసికూన వంటి నమీబియా జట్టుతో తలపడి ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్  టాస్ గెలిచి ఊహించని విధంగా నమీబియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 


నమీబియా ప్లేయర్లు మొదట కాస్త తడబడినప్పటికీ తర్వాత పుంజుకుని భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. నమీబియా బ్యాట్స్ మెన్ దిగ్గజ బ్యాట్స్ మెన్‌కు ఏమాత్రం తీసిపోనట్లు గ్రౌండ్ నలువైపులా షాట్లు కొడుతూ వీక్షకులను అలరించారు. 


నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. కానీ నమీబియా ఇచ్చిన 133 స్వల్ప పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు భారత బ్యాట్స్ మెన్ నానా తంటాలుపడ్డారు. 


కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్స్ మెన్ మెరుపులు మెరిపిస్తారని భారత క్రికెట్ అభిమానులు భావించారు. కానీ వాఏరి అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఆడారు. నమీబియా బౌలింగ్ గొప్పగా లేనప్పటికీ భారత బ్యాట్స్ మెన్ చాలా పేలవంగా ఆడారు. వాస్తవానికి 133 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించవచ్చు కానీ మరో ఐదు ఓవర్లు ఎక్కువ తీసుకున్నారు. దీంతో భారత్‌ జట్టు 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ 56, కేఎల్ రాహుల్ 54 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. 


 ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత జట్టు 2012 తర్వాత ఐసీసీ టీ-20 సెమీఫైనల్లో అర్హత సాధించకపోవడం ఇదే మొదటిసారి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, కోచ్‌గా రవిశాస్త్రికి ఇదే చివరి ట్‌-20 మ్యాచ్. ప్రపంచంలోనే మేటి జట్టుగా పేరొందిన భారత్‌ జట్టు ఓ పసికూనపై విజయం సాధించి ఐసిసి టీ-20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. 

ఐసిసి టీ-20 ప్రపంచ కప్ నుంచి టీమిండియాకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటర్‌గా వ్యవహరించారు. హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి, కోహ్లీ నాయకత్వం వహించారు. ఇంతమంది దిగ్గజాలున్నప్పటికీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు  రచించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ భారత్ మొదటి మ్యాచ్ నుండి చివరి మ్యాచ్ వరకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిటిలో సూపర్ ఫామ్‌ కనబరచలేదు. దీంతో సెమీఫైనల్స్ లో ఆడే అర్హత కోల్పోయింది. అలాగే భారత జట్టు మొదట పాకిస్తాన్ తో, ఆ తర్వాత న్యూజిలాండ్ జట్ల చేతిలో  పరాజయంతో మానసిక స్థైర్యాన్ని కోల్పోయింది. ఆ ప్రభావం మిగతా మ్యాచ్‌లపై పడింది. సుదీర్ఘంగా సాగిన ఐపీఎల్ కూడా భారత్‌ జట్టు పేలవమైన ఆట తీరుకు, ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు.

Related Post