నేడే భారత్‌-పాక్‌ టి-20 మ్యాచ్‌

October 24, 2021
img

భారత క్రికెట్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు రాత్రి (ఆదివారం) దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో టీ-20 ప్రపంచ కప్ రౌండ్‌లో-12లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులు చాలా ఆతృతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 

భారత్, పాక్ మ్యాచ్ అంటేనే అభిమానులకు పండగే. రెండు టీంలు సర్వశక్తులు ఒడ్డి గెలిచేందుకు తీవ్రంగా  ప్రయత్నిస్తాయి. గత కొన్ని ఏళ్లుగా పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌-పాక్‌ సంబంధాలు తెగిపోయాయి. కనుక ఐసిసి నిర్వహించే టీ-20 ప్రపంచ కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత్‌ అంగీకరిస్తుందా లేదా అని ఆత్రంగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు భారత్‌ సానుకూల నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం కలిగించింది. 

రెండు టీములు దుబాయ్ చేరుకోవడంతో ఇరు దేశాలలో క్రికెట్ అభిమానుల సందడి మొదలైంది. భారత్ టీంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండగా, పాక్ టీంలో ఫకర్ జమాన్, బాబరా అజామ్ షాదాబ్ ఖాన్ ఫామ్‌లో ఉన్నారు.

ఇక గత ప్రపంచ కప్ గణాంకాలను ఓ సారి పరిశీలించినట్లయితే భారత్‌-పాక్‌ మద్య జరిగిన 8 ట్‌-20 మ్యాచ్‌లలో భారత్ ఏడు మ్యాచ్‌లలో గెలవగా పాక్‌ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. కనుక ఈరోజు జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఫేవరెట్ జట్టుగా బరిలో దిగుతోంది. ఈసారి కూడా భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని భారత్‌లోని క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. భారత్‌-పాక్‌ మద్య జరుగబోయే ఈ మ్యాచ్‌ భారత్‌ కాలమాన ప్రకారం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్ గెలిస్తే దుబాయ్ పిచ్ బౌలింగ్‌కు చాలా అనుకూలం కనుక బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 

 భారత్ టీం(అంచనా): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బూమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శార్దూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్.

పాకిస్తాన్ టీం(అంచనా): ఆసిఫ్ అలీ, బాబర్ అజామ్, ఫకర్ జమాన్, హైదర్ అలీ, ఖుషిదిల్ షా, ఇమాద్ వసీం, మహమ్మద్  హఫీజ్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, షాహెబ్ మాలిక్, మహమ్మద్ రిజ్వాన్, సర్పరాజ్ అహ్మద్, హసన్ అలీ, షహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాదిర్.

Related Post