ఐపీఎల్ కప్ గెలుచుకొన్న చెన్నై సూపర్ కింగ్స్

October 16, 2021
img

ఐపీఎల్ సీజన్-14 టీ-20 కప్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) టీం సొంతం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో సిఎస్‌కె అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించడంతో ఐపీఎల్ కప్ ను వరించింది. శుక్రవారం రాత్రి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ పోరులో సిఎస్‌కెతో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్‌) తలపడింది. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ టాస్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న సిఎస్‌కెను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెకెఆర్ తీసుకున్న ఈ నిర్ణయం  తప్పని ఆ టీంకు మొదటి ఐదు ఓవర్లలోనే తెలిసొచ్చింది. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. సిఎస్‌కె ఓపెనర్లు రాణించడంతో భారీ స్కోరు సాధించింది. సిఎస్‌కె నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసి కేవలం మూడు వికెట్లను కోల్పోయింది. సిఎస్‌కె బ్యాటింగ్‌లో ఫాప్ డూప్లెసిస్ 86 పరుగులతో కెకెఆర్ బౌలర్లను బెంబేలెత్తించాడు. సిఎస్‌కె ఇచ్చిన 193 భారీ పరుగుల లక్ష్యాన్ని కెకెఆర్ చేధించలేక చతికిలపడింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో కెకెఆర్ బ్యాట్స్ మెన్  చాలా పేలవంగా ఆడారు. ఓపెనర్లు శుభారంభాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. దీంతో సిఎస్‌కె 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐపీఎల్ కప్‌ను ముద్దాడింది. సిఎస్‌కె ఇప్పటివరకు నాలుగు సార్లు ఐపీఎల్ కప్ సాధించిన టీంగా రికార్డులోకెక్కింది. సిఎస్‌కె ఐపీఎల్ కప్‌తో పాటు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన కెకెఆర్ టీం రూ.12.50 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది.

ఇక ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన వారికిచ్చే ఆరెంజ్ క్యాప్ ఋతు రాజ్ గైక్వాడ్(సిఎస్‌కె) అందుకున్నాడు. అలాగే ఎక్కువ వికెట్లు తీసినందుకు ఇచ్చే పర్పుల్ క్యాప్‌ను హర్షల్ పటేల్ (ఆర్‌సిబి) అందుకున్నాడు.


Related Post