ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించిన కోల్‌కతా నైట్ రైడర్స్

October 14, 2021
img

ఐపీఎల్ సీజన్-14 చివరి దశకు చేరుకుంది. గత రాత్రి షార్జా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)ను ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. అంతకుముందు కేకేఆర్ టాస్ గెలిచి డిసిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో కెకెఆర్ బౌలింగ్ ఎంచుకుంది. కెకెఆర్ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో డిసి బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి చాలా   శ్రమించాల్సి వచ్చింది. దీంతో డిసి నిర్ణీత 20 ఓవర్లలో  135 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. డిసి ఇచ్చిన 136 పరుగుల లక్ష్యాన్ని కెకెఆర్ 19.5 ఓవర్లలో చేధించి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఏడు వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి కెకెఆర్ 15 ఓవర్లలోనే చేధిస్తుందనుకొన్నా బ్యాట్స్ మెన్ అనవసరమైన షాట్లకు ప్రయత్నించి వికెట్లను ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ టీంకు విజయానికి బాటలు వేసిన వెంకటేష్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ఈ విజయంతో కెకెఆర్ ఫైనల్లో ఆడేందుకు అర్హత సాధించింది.

ఐపీఎల్ సీజన్-14 ఫైనల్ మ్యాచ్‌ శుక్రవారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్  కప్ కోసం చెన్నై సూపర్ కింగ్స్,  వెర్సస్ కోల్‌కతా నైట్  రైడర్స్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు సిఎస్‌కె ఐపీఎల్ కప్‌ను మూడుసార్లు గెలుచుకుంది. కెకెఆర్ రెండుసార్లు కప్ గెలుచుకుంది. కనుక ఈ మ్యాచ్‌లో సిఎస్‌కె జట్టుకే ఐపీఎల్ కప్ గెలుచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Related Post