రెండో వన్డేలో కూడా భారత జట్టు ఘనవిజయం

July 21, 2021
img

ఇండియా-శ్రీలంక ద్వితీయశ్రేణి (జూనియర్స్) క్రికెట్ జట్ల మద్య రెండవ వన్డే మ్యాచ్‌లో కూడా గెలిచి ఇండియా జట్టు వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. గత రాత్రి కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. 

ఈ మ్యాచ్‌లో శ్రీలంక మళ్ళీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టు మొదటి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని రెండవ వన్డేలో అద్భుతంగా రాణించింది. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 275 భారీ పరుగుల లక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. ఈ  క్రమంలో  శ్రీలంక జట్టు తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఒక దశలో భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఇండియా జట్టు ఓటమి పాలవుతుందని అభిమానులు భావించారు. కానీ పేరుకే జూనియర్స్ కానీ సీనియర్స్ జట్టుకు ఏమాత్రం తీసిపోకుండా చక్కటి పోరాటపటిమను కనబరిచారు. వెంట వెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ పరుగుల వేటను మాత్రం కొనసాగించారు. 

ఇంకో ఐదు బంతులు  మిగిలి ఉండగానే ఇండియా 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఏడు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో  ఇండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో దీపక్ చాహర్ 69, సురేష్ కుమార్ యాదవ్ 53, ఇషాన్ కిషన్ 37 పరుగలలో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. దీపక్ చాహర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇరుజట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌తో వన్డే సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ట్‌-20 సిరీస్ జరగనుంది.

Related Post