ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌ మృతి

June 19, 2021
img

ఫ్లయింగ్ సిఖ్‌గా ప్రసిద్ధి చెందిన అలనాటి భారత్‌ దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ (91) శుక్రవారం చంఢీఘడ్‌లో తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్ళుగా వృధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మిల్కా సింగ్‌ ఇటీవల కరోనా బారినపడ్డారు. కరోనా నుంచి కోలుకొన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో చంఢీగడ్‌లోని పీజీఐఎంఈఆర్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ నిన్న రాత్రి సుమారు 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. 

మిల్కా సింగ్‌ 1932లో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని గోవింద్ పురాలో జన్మించారు. 1951లో భారత ఆర్మీలో చేరాక పరుగు పందేలలో ఆయన ప్రతిభ బయటపడింది. మిల్కా సింగ్‌ కఠోరశ్రమతో తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకొని 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించారు. ఆ తరువాత అనేక అంతర్జాతీయ పోటీలలో పాల్గొని అనేక పతకాలు సాధించారు. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్ పోటీలలో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. తృటిలో ఒలింపిక్ పతకాన్ని కోల్పోయినందుకు ఆయన చాలా కాలం తీవ్ర ఆవేదన చెందారు. కానీ పరుగు పందేలలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు, గౌరవాన్ని తెచ్చి పెట్టినందుకు మిల్కా సింగ్‌ యావత్ భారతీయుల హృదయాలలో చోటు సంపాదించుకొన్నారు. కేంద్రప్రభుత్వం 1959లో మిల్కా సింగ్‌ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. 

నాలుగు రోజుల క్రితమే మిల్కా సింగ్‌ భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో మృతి చెందారు. ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో ఆయన ముగ్గురు కుమార్తెలు, కుమారుడు తీవ్ర శోకంలో మునిగిపోయారు. భారత్‌ క్రీడాభిమానులు మిల్కా సింగ్‌ మృతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Post