హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు

June 17, 2021
img

హెచ్‌సీఏ (హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు అజారుద్దీన్‌పై అపెక్స్‌కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆయనకు ఈ నెల 10వ తేదీన షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో తీవ్ర ఆగ్రహం చెందిన అజారుద్దీన్‌ మరుసటి రోజున జరిగిన హెచ్‌సీఏ సర్వ సభ్య సమావేశంలో సభ్యులతో గొడవ పడ్డారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యి తుది తీర్పు వచ్చే వరకు అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. హెచ్‌సీఏలో ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అజారుద్దీన్‌పై పలు కేసులు కొనసాగుతుండటంతో ఆయన నియామకాన్ని హెచ్‌సీఏలో కొంతమంది సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అజారుద్దీన్‌ మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటుండటమే కాక హెచ్‌సీఏలో అవకతవకలు జరుగుతున్నాయని  ఆరోపిస్తున్నవారు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హెచ్‌సీఏ పనితీరు, అవకతవకల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిభ కనబరుస్తున్న యువ క్రికెటర్లను అజారుద్దీన్‌ ప్రోత్సహించడం లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ ఆరోపిస్తున్నారు. 

ఈవిదంగా పలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అజారుద్దీన్‌ వలన హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలుగుతోందని కనుక ఆయనను అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేసి, సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. హెచ్‌సీఏ నిర్ణయంపై అజారుద్దీన్‌ ఇంకా స్పందించవలసి ఉంది.

Related Post