సూర్యాపేట స్టేడియంలో గ్యాలరీ కూలి 100 మందికి గాయాలు

March 22, 2021
img

సూర్యాపేటలో ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభమైన 47వ జాతీయ కబడ్డీ పోటీలలో అపశృతి జరిగింది. ఈరోజు కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ముందు స్టేడియంలోని 3వ నెంబర్ గ్యాలరీ అకస్మాత్తుగా పెళపెళ శబ్ధలతో కూలిపోయింది. ఆ సమయంలో దానిపై సుమారు 5,000కు పైగా ప్రేక్షకులు కూర్చొన్నట్లు సమాచారం. వారిలో 100 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీసులు వారినందరినీ అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌ తరలించారు. 

గ్యాలరీ సామర్ధ్యానికి మించి ఎక్కువమంది కూర్చోవడం వలననే కూలిపోయినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించి స్టేడియంలో కూలిపోయిన గ్యాలరీని పరిశీలించారు. 


47వ జాతీయ కబడ్డీ పోటీలలో పాల్గొనేందుకు 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. ఒక్కో గ్యాలరీలో 5,000 మంది చొప్పున కూర్చోనేందుకు వీలుగా మూడు గ్యాలరీలు నిర్మించగా వాటిలో మూడో నెంబర్ గ్యాలరీ కూలిపోయింది. కబడ్డీ పోటీలు మొదలయ్యే ముందు ఈ ప్రమాదం జరుగడంతో పోటీలను నిలిపివేసి సహాయ చర్యలు చేపట్టారు. తొలిసారిగా జిల్లాలో జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీలు కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి చాలా భారీ సంఖ్యలో యువత తరలివచ్చారు. దాంతో స్టేడియంలోపల, బయట కిటకిటలాడిపోయింది. జిల్లా అధికారులు, సిబ్బంది ఈ పోటీలను చాలా ప్రతిష్టాత్మకంగా భావించి రేయింబవళ్లు కష్టపడి అన్ని ఏర్పాట్లు చేస్తే పోటీలు ప్రారంభం కాకమునుపే ఈ ఘోరప్రమాదం జరుగడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


Related Post