పెద్ద హీరోలు తీరు మారకుంటే ఇంతే సంగతులు: బన్నీ

June 06, 2025
img

సినీ పరిశ్రమలో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పర్సంటేజ్ సమస్యపై అందరూ తలో మాట మాట్లాడుతున్నారు తప్ప ఈ సమస్య పరిష్కారానికి ఎవరూ పూనుకోవడం లేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇద్దరూ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌ గురించి మాట్లాడి ఈ సమస్యని పక్కదారి పట్టించారని ప్రముఖ నటుడు నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి ఆరోపించారు.

తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వ్యాస్ కూడా ఈ సమస్యపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “థియేటర్లకు ప్రేక్షకులు రాకపోతే ఎలా రప్పించి ఆదాయం పెంచుకోవాలో ఆలోచించాలి తప్ప వచ్చే 50 పైసల ఆదాయంలో సగం సగం వాటాలు పంచుకుందామని నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి యజమానులు గొడవపడటం సరికాదన్నారు. 

అసలు థియేటర్లలో సినిమాలు విడుదలైన సినిమాలు 28 రోజులలోనే ఓటీటీలో విడుదల చేస్తుండటం వలననే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. అలాగే పెద్ద హీరోలు రెండు మూడేళ్ళకు ఓ సినిమా రిలీజ్‌ చేస్తుండటం వలన కూడా థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోతోంది.

ఈ సమస్యలని పరిష్కారించుకుండా ఇలాగే వదిలేస్తే రాబోయే 4-5 ఏళ్ళలో 90 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడటం ఖాయం. అప్పుడు కేవలం మల్టీ ప్లెక్స్ థియేటర్లు మాత్రమే మిగులుతాయి. వాటి ఆదాయంలో నుంచి నిర్మాతలకు కేవలం 43 శాతం మాత్రమే అందుతుంది,” అంటూ నిర్మాత బన్నీ వ్యాస్ నిష్కర్షగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


Related Post