పుష్పరాజ్ ఎప్పటికీ గుర్తుండిపోతాడు: వర్మ

December 08, 2024
img

పుష్ప-2 గురించి ఇప్పటికే సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పుష్ప-2లో కధ తక్కువైనప్పటికీ అల్లు అర్జున్‌ తన నట విశ్వరూపంతో సినిమాని నిలబెట్టాడని దాదాపు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమౌళి వంటివారు కూడా చూసి పుష్ప-2 అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. 

కానీ ఓ దర్శకుడు మరో దర్శకుడి సినిమాని చూసి విశ్లేషిస్తే అది నిజమైన విశ్లేషణ అవుతుంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా పుష్ప-2 చూసి, దానిలో పుష్పరాజ్ పాత్రని చాలా చక్కగా విశ్లేషించారు. 

“భారతీయ సినిమాలలో చాలా అరుదుగా పుష్పరాజ్ వంటి అర్డుదాయిన పాత్రలు సృష్టించబడుతుంటాయి. అల్లు అర్జున్‌ తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి ఈ పాత్రలోకి రూపాంతరం చెందాడు.

పుష్పరాజ్ వంటి అరుదైన పాత్రని నిజ జీవితంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారని నమ్మేలా ఉంది. అల్లు అర్జున్‌ అంతగా ఆ పాత్రని పండించారు. 

ఓ కమర్షియల్ సినిమాలో ఇటువంటి పాత్రని ఊహించడమే కష్టం. కానీ అల్లు అర్జున్‌ తన నటనతో సాధ్యమే నిరూపించి చూపారు. పుష్పరాజ్ పాత్రలో అమాయకత్వం, కపటగుణం, విపరీతమైన అహంభావం వంటి అనేక వైరుధ్యాలున్నాయి. అన్నిటినీ అల్లు అర్జున్‌ అద్భుతంగా చేసి చూపారు.  

సినిమాలలో హీరో అంటే కొన్ని నిర్దిష్టమైన కొలమానాలు ఉంటాయి. కానీ అటువంటివేవీ లేని పుష్పరాజ్‌ని కుండా అల్లు అర్జున్‌ హీరోగా ఆవిష్కరించి చూపాడు. పుష్పరాజ్ పాత్ర కొన్ని దశాబ్ధాలపాటు ప్రేక్షకుల హృదయాలలో తప్పక నిలిచిపోతుంది. భవిష్యత్‌లో రాబోయే సినిమాలలో పాత్రని దీనితో పోల్చి చూసుకుంటారు.         

 పుష్ప-2లో కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నమ్మశక్యంగా ఉండవు. కానీ అల్లు అర్జున్‌ తన అద్భుతమైన నటనతో అందరినీ నమ్మించి మెప్పించాడు. ఆ పాత్రలో అతని నటన చూస్తున్నప్పుడు ఆ పాత్ర సినిమాని మరింత గొప్పగా చేసిందా లేక సినిమాయే ఆ పాత్రని ఆ స్థాయిలో మలిచిందా? అని అనిపిస్తుంది.     

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్‌ బాడీ లాంగ్వేజ్‌తో పాటు భావోద్వేగాలు అద్భుతంగా పండించాడు. ముఖ్యమంత్రి తనతో ఫోటో దిగేందుకు నిరాకరించినప్పుడు, మద్యం త్రాగి తన అహం చంపుకుని క్షమాపణ చెప్పే సన్నివేశం ఇందుకు గొప్ప ఉదాహరణ.

సినిమాలో పుష్పరాజ్ పాత్రని పూర్తిగా ఆస్వాదించిన తర్వాత ఎవరికి నచ్చినా నచ్చక పోయినా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. పుష్పరాజ్ పాత్ర ముందు అల్లు అర్జున్‌ కూడా తక్కువే అనిపిస్తుంది,” అంటూ రాంగోపాల్ వర్మ అల్లు అర్జున్‌ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. 

Related Post