గేమ్ చేంజర్‌ తగ్గడానికే లేదు..తగ్గితే..

December 05, 2024
img

పుష్ప-2 రిజల్ట్ వచ్చేసింది. సినిమాకి మంచి టాక్, భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. పుష్ప-2 సరికొత్త రికార్డ్స్ సృష్టించబోతోందని అందరూ బల్ల గుద్ది వాదిస్తున్నారు. 

పుష్పరాజ్ తగ్గేదేలే అని తేల్చి పడేశాడు కనుక ఇప్పుడు రామ్ చరణ్‌ ‘గేమ్ చేంజర్‌’గా నిలుస్తాడా లేదా? అనే చర్చ మొదలైంది.

ఈ సినిమాని దక్షిణాదిన పేరుమోసిన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండటంతో దానిలో మెగా హీరో రామ్ చరణ్ హీరో కావడంతో మొదటి నుంచే దీనిపై చాలా భారీ అంచనాలున్నాయి. ఇప్పుడవి  మరింత పెరిగిపోవడంతో గేమ్ చేంజర్‌ తప్పనిసరిగా పుష్ప-2ని బీట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లేకుంటే మెగాభిమానులకు చాలా నామోషీగా ఉంటుంది. 

ఒక్క రామ్ చరణ్‌ మాత్రమే కాదు... ఇండస్ట్రీలో, తెలుగు ప్రేక్షకులలో మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి కూడా ‘విశ్వంభర’తో సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సి ఉంటుంది.

జూనియర్ యన్టీఆర్‌  దేవరతో ఓకే అనిపించుకున్నారు కానీ ఈ స్థాయిలో హిట్ కొట్టలేదు. కలెక్షన్స్ సాధించలేకపోయారు. కనుక జూనియర్ యన్టీఆర్‌ కూడా పుష్ప-2కి తీసిపోని ఓ హిట్ ఇవ్వకపోతే అభిమానులు హర్ట్ అవుతారు.

ప్రభాస్‌ తదితర స్టార్ హీరోలందరికీ ఇదే సమస్య. మహేష్ బాబు రాజమౌళితో ఫిక్స్ అయిపోవడం వలన ఈ సమస్య నుంచి తప్పించుకున్నారనే చెప్పొచ్చు. 

కానీ ప్రతీ సినిమా పుష్ప-2కి మించి ఉండాలంటే ఎంతటి నటుడు, దర్శకుడికైనా కష్టమే. పుష్ప-2తో తెలుగు సినీ పరిశ్రమ మరో మెట్టు ఎక్కుతూనే, అక్కడే నిలిచి ఉండాల్సిన పరిస్థితి పుష్ప-2 కల్పించిందని చెప్పొచ్చు.          

పుష్ప-2తో అల్లు అర్జున్‌ ఎవరూ అందుకోలేని స్థాయికి ఎదిగిపోయారు కనుక ఇప్పుడు ఆయనకు కూడా ఇకపై చేయబోయే ప్రతీ సినిమా సవాలుగానే మారడం ఖాయం. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. వైల్డ్ ఫైర్’ అని చెప్పేశారు కనుక ఇక టాలీవుడ్‌లో ‘వైల్డ్ ఫైర్’ (కార్చిచ్చు)ని ఎవరూ తప్పించుకోలేరు.

Related Post