చిరంజీవికి అన్నీ కావాలి... బాలకృష్ణకి దర్శకుడు మాటే వేదం!

November 20, 2024
img

ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి సినీ పరిశ్రమలో ఇద్దరు సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితో సినిమాలు చేశారు. కనుక వారిద్దరి తీరు ఎలా ఉంటుందో అందరి కంటే ఆయనకే బాగా తెలుసు. చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణతో ‘డాకూ మహరాజ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది. 

ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బాబీని “చిరంజీవి, బాలకృష్ణలతో పనిచేయడం మీకు ఎలా అనిపించింది?” అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, “చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరి తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. చిరంజీవి ఏదైనా ఓ సినిమా చేయడానికి అంగీకరిస్తే, సినిమాకి సంబందించి ప్రతీ విషయాన్ని పట్టించుకుంటారు. అవసరమైతే సాయపడుతుంటారు. 

సినిమా షూటింగ్‌ మొదలుపెట్టక మునుపే స్క్రిప్ట్ సిద్దంగా ఉండాలి. పూర్తిగా చదివి వినిపించాలి. అలాగే ప్రతీరోజూ ముందుగానే సెట్స్‌కు వచ్చి ఆరోజు షూటింగ్‌ చేయబోయే సన్నివేశాల గురించి అడిగి తెలుసుకుంటారు. వాటిలో తన పాత్రకి సంబందించి డైలాగ్స్ పేపర్ తప్పనిసరిగా ముందుగానే ఆయనకు అందించాలి. దానిలో కూడా ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుంటారు. అంతా ఒకే అనుకున్నాకనే చిరంజీవి షూటింగ్‌కి సిద్దమవుతారు,” అని దర్శకుడు బాబీ చెప్పారు. 

బాలకృష్ణ గురించి వివరిస్తూ, “ఆయనకు మనం చెప్పిన కధ నచ్చితే చాలు. ఆ తర్వాత సినిమా షూటింగ్‌ పూర్తయ్యేవరకు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా దర్శకుడు ఎలా చెపితే అలా చేసుకుంటూ పోతారు. ‘సెట్స్‌లో దర్శకుడే లీడర్ ఎవరికైనా ఆయన మాటే ఫైనల్’ అని చెపుతుంటారు. అలాగే ఆచరిస్తారు కూడా. 

ఈ పద్దతి ఆయన తన తండ్రిగారి నుంచి నేర్చుకున్నదే. కానీ ఇన్నేళ్ళలో తాను కూడా అనేక సినిమాలు చేశాను కదా అని బాలకృష్ణ ఏనాడూ తన ఈ విధానాన్ని మార్చుకోలేదు. ఇది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఆయన వంటి పెద్ద నటుడు దర్శకుడుపై ఇంత నమ్మకం పెట్టుకొని పనిచేస్తున్నారనే ఆలోచన దర్శకుడి బాధ్యత మరింత పెంచుతుంది. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఇంకా అద్భుతంగా సినిమా తీసి చూపాలనే తపన కలుగుతుంది,” అని దర్శకుడు బాబీ అన్నారు.

Related Post