సముద్రాన్ని ఏలిన దేవర ప్రేక్షకులని మెప్పించాడా?

September 27, 2024
img

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు చేసిన దేవర భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.

సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినీ విమర్శకులు కూడా మంచి రేటింగ్ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉందో క్లుప్తంగా చెప్పుకుంటే జూ.ఎన్టీఆర్‌, సైఫ్ అలీఖాన్ పోటాపోటీగా నటించారు.

సముద్రం మీదుగా ఆయుధాల అక్రమ రవాణ అనే పాయింట్ మంచి యాక్షన్‌ సినిమాకు అవకాశం కల్పిస్తుంది. కొరటాల ఆ పాయింట్ తీసుకొని పాత కధకు తనదైన శైలిలో కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, భారీగా యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు, ప్రేక్షకులు ముఖ్యంగా జూ.ఎన్టీఆర్‌ అభిమానులు ఎదురుచూసే పంచ్ డైలాగులు, కాస్త రొమాన్స్ వేసి దేవరలో దట్టించి వదిలారు. ఈ సినిమాకి జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా ఎంచుకోవడం కూడా అటువంటి ప్రయత్నమే అని చెప్పవచ్చు.           

జాన్వీ కపూర్‌ తెలుగులో తొలి పరిచయమే అయినప్పటికీ ఆమె ఇదివరకు చాలా సినిమాలలో నటించిన అనుభవం ఉంది కనుక తన పాత్రని అలవోకగా చేసి మెప్పించారు. అయితే ఈ సినిమాకి, కధకి హీరో జూ.ఎన్టీఆర్‌ మాత్రమే కనుక ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఉద్రిక్తంగా సాగుతున్న సినిమాలో తన డ్యాన్స్, అందాలతో ప్రేక్షకులను రిలాక్స్ చేయడానికే ఆమె పాత్రని పెట్టిన్నట్లు అనిపిస్తుంది. 

జూ.ఎన్టీఆర్‌ ఎప్పటిలాగే సినిమాని ఒంటి చేత్తో నడిపించారు. ఈవిషయంలో సైఫ్ అలీఖాన్ జూ.ఎన్టీఆర్‌కి చాలా తోడ్పడ్డారు. 

అనిరుధ్ అందించిన సంగీతం, రత్నవేలు కెమెరా పనితనం, యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా కుదిరాయి. ఇవన్నీ దేవరకి ప్లస్ పాయింట్సే కనుక ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు.

ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేసిన సినిమా ఇది కనుక అభిమానులు భయపడి ఉండవచ్చు. కానీ వారి అంచనాలకు మించే దేవర అందించారు. కనుక అభిమానులు, ప్రేక్షకులు, కొరటాల శివ, జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, దేవర టీమ్‌ అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు. 

Related Post