కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పాటలు, టీజర్, ట్రైలర్‌లకు సినీ విశ్లేషకులు, అభిమానులు మంచి మార్కులే వేసి అందరూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారిప్పుడు.
సినిమా విడుదలయ్యేందుకు ఇంకా రెండు వారాలు సమయం ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డు కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్లు. అంటే సుమారు మూడు గంటలనుకోవచ్చు.
ఈరోజుల్లో మూడు గంటల సినిమా తీయడం అంటే కొంత రిస్క్ తీసుకుంటున్నట్లే చెప్పవచ్చు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని ఒక భాగంలో పూర్తి చేస్తాడనుకుంటే రెండు భాగాలని ప్రకటించినప్పుడే అభిమానులు కాస్త అసహనానికి గురయ్యారు.
అలాంటిది మొదటి భాగం రెండున్నర గంటల్లో ముగించి ఉంటే బాగుండేది కానీ మూడు గంటలకి సాగదీశారు. ప్రేక్షకులను థియేటర్లలో ఎంతసేపు కూర్చోబెట్టగలిగితే అంత గొప్ప విషయమే. కానీ సరిగ్గా అదే కారణంగా సినిమాలో లోపాలన్నీ బయటపడతాయి కూడా.
ఒకవేళ ఈ సినిమాతో కొరటాల ప్రేక్షకులను అలరించగలిగితే పర్వాలేదు. కానీ అలా కాకపోతే ఈ ప్రభావం రెండో భాగంపై పడే ప్రమాదం ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ హీరో జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల, నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ చరణ్ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఓవర్సీస్ ప్రీ-రిలీజ్ బుకింగ్స్ కూడా చాలా భారీగానే ఉన్నాయి. కనుక భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న దేవర సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాం.