అర్షద్ వార్సీ అందుకే అలా అన్నాడేమో?

August 25, 2024
img

కల్కి ఎడి2898లో ప్రభాస్‌ ఓ జోకర్‌లా ఉన్నాడని బాలీవుడ్‌ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను దురుదేశ్యంతో ఆవిదంగా అన్నాడా లేక కల్కిలో ప్రభాస్‌ పాత్ర హీరోయిజంకి బదులు చిలిపిగా ఉండటం నచ్చక ఆవిదంగా అన్నాడా? అంటే రెండోదే అనుకోవచ్చు.

ఎందువల్ల అంటే మన సినిమాలలో హీరో పరిచయమే అదిరిపోయేలా ఉంటుంది. దానికి తోడు సినిమాలో హీరోని గొప్పగా చూపేందుకే సృష్టించిన సన్నివేశాలు, డైలాగ్స్ ఉండనే ఉంటాయి. హీరోలు కూడా సూపర్ మ్యాన్ అన్నట్లు వంద మందిని ఒంటి చేత్తో కొట్టి పడేయగలరు.

హీరోకి కనీసం ఒక హీరోయిన్‌ కుదిరితే ఇద్దరో ముగ్గురో తప్పనిసరి. కనుక హీరో అంటే ఇలాగే ఉండాలి... ఇలాగే నటించాలి... ఏమాత్రం తగ్గిన హీరో కాదనే భావన చాలా మందిలో ఉంటుంది. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి ఆపద్బాంధవుడు, స్వయంకృషి, రుద్రవీణ, డాడీ క్లాసిక్ సినిమాలు చేస్తే అభిమానులకు ఎక్కలేదు.

అదేవిదంగా అర్షద్ వార్సీ కూడా కల్కి ఎడి2898 ప్రమోషన్స్ చూసి ప్రభాస్‌ గురించి ఏదేదో ఊహించేసుకుని థియేటర్‌కి వెళితే ప్రభాస్‌ చిలిపిగా, చాలా క్యాజువల్‌గా నటించడం జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు.

అయితే ఆయన సినిమా మెరిట్స్ గురించి మాట్లాడకుండా పాన్ ఇండియా స్థాయి హీరో ప్రభాస్‌ని జోకర్ అని అనేయడం చాలా తప్పే. అందుకే అందరూ ట్రోల్ చేస్తున్నారనుకోవచ్చు. అయితే నాగ్ అశ్విన్‌ మాత్రం , “మీ పిల్లలకి బొమ్మలు పంపిస్తానంటూ,” చాలా హుందాగా స్పందిస్తుండటం అభినందనీయం. 


Related Post