రాజమౌళి, రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లకు తప్ప అందరికీ ఆవార్డులే!

August 25, 2023
img

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ఆస్కార్ అవార్డ్ లభించింది. తాజాగా ఆరు జాతీయస్థాయి అవార్డులు కూడా లభించాయి. అయితే ఈ సినిమాని సృష్టించిన రాజమౌళికి, దానికి తమ నటనతో ప్రాణం పోసిన రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లకు గానీ అవార్డులు లభించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అయితే ఆర్ఆర్ఆర్‌ సినిమాకు అవార్డులు ప్రకటించిన ప్రతీసారి వీరి ముగ్గురి పేర్లే మొదట ప్రస్తావిస్తుంటారు. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్ వేదికపై అవార్డ్ అందుకొన్నారు. కానీ రాజమౌళికి ఆ అవకాశం లభించలేదు. 

ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవలసి ఉంటుంది. నిజానికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సింది ‘నాటు నాటు’ పాటకో, దాని సంగీతానికో కాదు... ఆ పాటకు అత్యంత క్లిష్టమైన డాన్స్ చేసిన రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లకు, యావత్ ప్రపంచదేశ ప్రజల చేత ఆ డ్యాన్స్ చేసేలా చేసిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌లకు ఆస్కార్ అవార్డ్ ఇచ్చి ఉండాలనే వాదనలు వినిపించాయి.

అయితే వారు ముగ్గురి ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభించలేదు. నేటికీ లభించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ నాటునాటు పాటకే కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్‌కు నిన్న జాతీయ అవార్డు లభించడం చాలా సంతోషించదగ్గ విషయమే. కానీ రాజమౌళి, రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఇంకా ఎప్పుడు గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం?అనే ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినబడుతోంది.

Related Post