ఆదిపురుష్‌ నుంచి మరో పాట: రామ్ సీతారాం... జైజై సీతారాం!

May 29, 2023
img

ప్రభాస్‌, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమా నుంచి “రామ్ సీతారాం... సీతారాం... జైజైరామ్” అంటూ సాగే మరో హృద్యంగా సాగే పాట విడుదలైంది. ఈ వీడియో సాంగ్‌లో సీతారామాలు నదిలో తెప్పపై ప్రయాణిస్తుండగా వారిరువురి మద్య సంభాషణలు (డైలాగ్స్), పొద్దుతిరుగుడు పూలతోటలో విహారం, మిణుగురు పురుగులతో మిలమిల మెరిసిపోతున్న తోట, నెమళ్ళ మద్యలో సీతారాములు, హనుమంతుడు లంకలో సీతమ్మవారిని కలిసి, ఆమె ఇచ్చిన ఉంగరం తీసుకొని తిరిగి వచ్చి శ్రీరాముడుకి అందించడం వంటి కొన్ని సన్నివేశాలను కూడా దీనిలో చూపడంతో ఆదిపురుష్‌ సినిమా ఏస్థాయిలో ఉండబోతోందనే దానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. 

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటించారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.

ఆదిపురుష్‌ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. టీజర్‌ వలన ఎరుడైన విమర్శలు, అనుమానాలు, అపోహలకు దర్శకుడు ఓం రౌత్ ట్రైలర్‌తో గట్టిగా సమాధానం చెప్పడంతో, ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శన హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది.

తాజా సమాచారం ప్రకారం ఓ ప్రముఖ సినీ సంస్థ రూ.150 కోట్లు చెల్లించి ఆదిపురుష్‌ హక్కులు కొనుగోలు చేసిన్నట్లు తెలుస్తోంది. అంటే పెట్టుబడిలో అప్పుడే అంత సొమ్ము వెనక్కు వచ్చేసిందన్న మాట! ఈ సినిమా హక్కుల కోసం ఓ సంస్థ అంత చెల్లించిందంటే ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో, ఏ స్థాయిలో కలక్షన్స్‌ ఉంటాయో ఊహించుకోవచ్చు.


Related Post