ఆదిపురుష్‌ బాణం ఎప్పుడూ ఎందుకు తడబడుతుందో?

May 17, 2023
img

ఆదిపురుష్‌ సినిమా టీజర్‌పై వచ్చిన విమర్శల ప్రభావం ఇంకా ఆ సినిమా దర్శకనిర్మాతల మీద బాగానే ఉన్నట్లుంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ వారిలో ఇంకా ఆ బెదురు, ఆ భయం పోయిన్నట్లు లేవు. అందుకే జూన్ 13న అమెరికాలో ట్రిబెకా చలన చిత్రోత్సవాలలో ప్రీమియర్ షోని రద్దు చేసుకొన్నట్లున్నారు. 

ఆదిపురుష్‌ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది కనుక మూడు రోజులు ముందుగా ప్రీమియర్ షో వేస్తే, సినిమా గురించి పాజిటివ్ టాక్ వస్తే మంచిదే కానీ పొరపాటున నెగెటివ్ టాక్ వచ్చిన్నట్లయితే అది కార్చిచ్చులా భారత్‌ అంతటా శరవేగంగా పాకిపోతుంది. అప్పుడు రూ.500 కోట్ల పెట్టుబడితో తీసిన సినిమా దెబ్బ తింటుంది. కనుక అమెరికా కాలమాన ప్రకారం జూన్ 15వ తేదీ రాత్రి 8 గంటలకు ఆదిపురుష్ ప్రీమియర్ షో వేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. 

మూడు రోజుల ముందుగా ప్రీమియర్ షో ఆలోచన విరమించుకోవడానికి వారు వేరే కారణాలు చెప్పబోతున్నప్పటికీ అసలు కారణం మాత్రం ఇదేనని భావించవచ్చు. అయితే ఆదిపురుష్‌ సినిమా మహాద్భుతంగా తీశామని, ప్రజలు దానికి జేజేలు పలికేలా ఉంటుందని దర్శకుడు ఓం రౌత్ గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, ప్రీమియర్ షో ఎందుకు రద్దు చేశారని సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంటే తమ సినిమా మీద దర్శకనిర్మాతలకు ఇంకా నమ్మకం కలుగలేదా? ఇంకా ఏవైనా అనుమానాలు, భయాలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.

Related Post