పాపం శాకుంతలం... పట్టించుకొనే నాధుడే లేడు

May 11, 2023
img

ఒక్కోసారి చాలా బారీ అంచనాలతో విడుదలైన సినిమాలకు మొదటిరోజునే నెగెటివ్ టాక్ వచ్చి ఎదురుదెబ్బ తింటుంటాయి. అటువంటివాటిలో లైగర్, ఏజంట్, శాకుంతలం సినిమాలున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌, పుష్పలో ఐటెమ్ సాంగ్‌తో సమంత జాతీయస్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకొంది. ఆమె మీద నమ్మకంతో పాన్ ఇండియా మూవీగా ‘యశోద’ తీస్తే అదీ బాగానే ఆడింది. అదే నమ్మకంతో శాకుంతలం తీస్తే బెడిసికొట్టింది. మొదటిరోజునే నెగెటివ్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు వెళ్ళే ఆలోచన మానుకోవడంతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీసం నిర్మాతలకు పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. 

సమంత, శాకుంతలంపై నమ్మకంతో అమెజాన్ ప్రైమ్‌ సంస్థ సుమారు రూ.20 కోట్లు ముట్టజెప్పి ఆ సినిమా ప్రసారహక్కులు దక్కించుకొంది. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో అదీ నష్టపోయింది. అది వేరే విషయం. కానీ శాకుంతలం సినిమా బుదవారం అర్దరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ కోసం దానిలో పనిచేసిన ప్రతీ ఒక్కరూ పోటీ పడుతుంటారు. ఓటీటీలో విడుదలవుతున్నా దాని గురించి అందరి కంటే ముందు తామే చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. కానీ శాకుంతలం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయితే ఆ చిత్రబృందంలో నిర్మాతతో సహా ఎవరూ పట్టించుకోలేదు. ఈ అపజయాన్ని సమంత పద్దులోనే వ్రాస్తారు కనుక ఆమె కూడా దీని గురించి మాట్లాడలేదు. పాపం శాకుంతలం... ఓ అనాధగా మిగిలిపోయింది. 

Related Post