పరిగెత్తేవారి చేతులు పట్టుకోకూడదు: చిరంజీవి

January 18, 2023
img

అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ టాక్ షోని అదరగొట్టేస్తున్నారు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే బాలయ్య ఆ షోలో మాత్రం సరదాగా కవ్విస్తూ, నవ్విస్తూ చాలా హుషారుగా షో నడిపిస్తూ రక్తి కట్టిస్తున్నారు. "అయితే ఆ షోని హోస్ట్‌ చేసేందుకు చిరంజీవిని పిలవకుండా అల్లు అరవింద్ బాలయ్యని ఎందుకు ఎంచుకొన్నారు? అల్లు, కొణిదెల కుటుంబాల మద్య విభేధాలున్నందునేనా?" అని విలేఖరులు నేరుగా చిరంజీవినే ప్రశ్నించారు. 

దానికి ఆయన సమాధానమిస్తూ, “ఆహా ఓటీటీ అందరిదీ. దానిలో అన్‌స్టాపబుల్‌ షోకి నన్ను అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. బాలయ్య ఆ షో చేస్తున్నారు కనుక నాకు అల్లు అరవింద్ మద్య ఏవో విభేధాలు ఉన్నాయనుకోవడం సరికాదు. మా రెండు కుటుంబాల మద్య బలమైన బంధాలు, సంబంధాలు ఉన్నాయి. పండుగలు, పబ్బాలు, బర్త్ డే వేడుకలకి ఒకరింటికి మరొకరం వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేస్తుంటాము. ఈ విషయం అందరికీ తెలుసు.

ఇక మా రెండు కుటుంబాల హీరోల మద్య పోటీ విషయానికి వస్తే  అది చాలా ఆరోగ్యకరమైన పోటీయే... అది చాలా అవసరం కూడా. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటూ తమకంటూ గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తుంటారు. అప్పుడు వారిని మనం ఎంకరేజ్ చేయాలే తప్ప మద్యలో జోక్యం చేసుకోకూడదు.

చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు పిల్లల చేయి పట్టుకొని నడిపించాలీ. కానీ వారు పెరిగి పెద్దయిన తర్వాత పరుగులు తీస్తుంటే వారి చేతులు పట్టుకొని పరుగులు నేర్పించాలని ప్రయత్నించకూడదు. అప్పుడే వారు వృద్ధిలోకి వస్తారు. వారు వృద్ధిలోకి వస్తే అందరికీ సంతోషమే కదా?” అని చిరంజీవి అన్నారు.

Related Post