నేను అప్పుడే చచ్చిపోవడం లేదు: సమంత

November 08, 2022
img

ఈ నెల 11న యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమంత ఇంకా పూర్తిగా కోలుకొనప్పటికీ చెప్పినట్లుగానే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు వచ్చేశారు. అయితే వేదికపై కాకుండా ఓ ప్రముఖ తెలుగు మీడియాలో యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొని తన మనసులో చెలరేగుతున్న భావోద్వేగాలను ప్రేక్షకులతో పంచుకొన్నారు. 

సమంత మాట్లాడుతూ, “ఒక్కోసారి ఇక ఏమీ లేదనిపిస్తుంది. మరోసారి... కష్టపడితే తప్పకుండా మరో అడుగు వేయగలననిపిస్తుంది. కొన్నిసార్లు వెనక్కు తిరిగి చూసుకొంటే ఇంత లైఫ్... ఇన్ని కష్టాలు దాటేసి వచ్చేశానా... అని నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు నాకొచ్చిన ఈ వ్యాధి మయొసైటీస్‌ గురించి నేను సోషల్ మీడియాలో బయటపెట్టగానే, నేను నేడో రేపో చనిపోబోతునాన్నంట్లు అందరూ వ్రాసేస్తున్నారు. కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఉంటాను కూడా. ప్రస్తుతం నేనున్న ఈ స్టేజి అంత ప్రాణాంతకమైనది కాదు. తప్పకుండా క్యూర్ అవుతుందనే నమ్మకం నాకుంది,” అంటూ సమంత తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకొన్నారు. 

సుమ స్పందిస్తూ, “నేను మొదటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మీ జీవితాన్ని మీరే స్వయంగా అద్భుతంగా క్రియేట్ చేసుకొన్నారు. ఇదివరకు మీరు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా ధైర్యం కోల్పోకుండా చాలా నిబ్బరంగా పోరాడారు. మీలో ఆ ఫైటింగ్ స్పిరిటే నేడు మిమ్మలని ఇక్కడివరకు తీసుకువచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అనే గట్టి నమ్మకం నాకుంది. కనుక ఇప్పుడు మీరు ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు?” అని ప్రశ్నించారు. 

సమంత సమాధానం చెపుతూ, “నిజమే! నా జీవితంలో నేను ప్రతీ అడుగు వేయడానికి చాలా పోరాడవలసి వచ్చింది. అయితే ఈ వ్యాది సోకిన తర్వాత నాకు జీవితంలో మరో కొత్త విషయం అర్దమైంది. జీవితంలో ఏదీ మనం అనుకొన్నట్లు జరగదని కనుక జీవితంలో జరుగబోయే వాటితో ప్రయాణించవలసి ఉంటుందని. కనుక ఇప్పుడు కొత్తగా పెద్ద నిర్ణయాలేవీ తీసుకోను. జరిగేవి జరుగుతుంటాయి. వాటితోనే నా ప్రయాణం,” అని సమంత చెప్పారు.               


(Video Courtecy: ABN Live)

Related Post